Rohit Sharma: రోహిత్ శర్మ, కోహ్లీ ‘ఛాంపియన్స్ ట్రోఫీ-2025’ ఆడతారా?.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ సెక్రటరీ జైషా
- ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనున్న జట్టులో విరాట్, రోహిత్ భాగమయ్యే అవకాశాలున్నాయన్న జైషా
- ప్రస్తుత జట్టే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందని, సీనియర్లు ఉంటారని క్లారిటీ
- టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్సీపై సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన వెంటనే సీనియర్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టీ20 ఫార్మాట్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఆ మరుసటి రోజే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ పలికాడు. భారత క్రికెట్ పరివర్తన దశలో ఉందని, యువతరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెబుతూనే ఈ ముగ్గురూ వన్డే, టెస్టు ఫార్మాట్లలో కొనసాగుతామని చెప్పారు. మరి పాకిస్థాన్ వేదికగా 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్, రోహిత్ ఆడతారా? అనే సందేహాలపై బీసీసీఐ సెక్రటరీ జే షా స్పందించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనున్న భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భాగమయ్యే అవకాశాలున్నాయని జైషా సంకేతాలిచ్చారు. టీ20 క్రికెట్‌కు ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు వీడ్కోలు పలకడంతో జట్టులో పరివర్తన జరిగిందని వ్యాఖ్యానించారు. భారత జట్టు పురోగమిస్తోందని, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలవడమే తదుపరి టార్గెట్ అని జైషా అన్నారు. అక్కడ కూడా ఇదే జట్టు ఆడుతుందని, సీనియర్లు ఉంటారని స్పష్టం చేశారు.
రోహిత్ వారసుడు పాండ్యా?
రోహిత్ శర్మ తర్వాత టీ20 ఫార్మాట్లో టీమిండియా పగ్గాలు హార్దిక్ పాండ్యా చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కెప్టెన్సీ రేసులో పాండ్యా అందరికంటే ముందున్నాడు. అయితే కెప్టెన్సీ అంశంపై జైషా స్పందిస్తూ.. కెప్టెన్‌ను సెలక్టర్లు నిర్ణయిస్తారని, సెలక్టర్లతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని జైషా వెల్లడించారు. నిజానికి వరల్డ్ కప్‌కు పాండ్యాను ఎంపిక చేయడంతో అతడి ఫామ్‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని, కానీ సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారని, దీంతో పాండ్యా తనను తాను నిరూపించుకున్నాడని జైషా వ్యాఖ్యానించారు.