Robot: దక్షిణ కొరియాలో రోబో ‘ఆత్మహత్య’!

Civil servant robot commits suicide deadly plunge under probe
  • ప్రపంచంలోనే ఈ తరహాలో తొలి సంఘటన నమోదు
  • గుమీ సిటీ కౌన్సిల్ ఆఫీసులోని మెట్ల పైనుంచి ఉద్దేశపూర్వకంగా దూకిన రోబో
  • కదలికలు లేని స్థితిలో గుర్తింపు.. కారణాలు ఏమిటో తెలుసుకొనే పనిలో తయారీ సంస్థ
జీవితంలో కష్టాలను ఎదుర్కోలేక కొందరు మనుషులు ఆత్మహత్య చేసుకుంటారని తెలుసు.. కానీ మర మనిషి ‘ఆత్మహత్య’ చేసుకోవడం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు.. యావత్ ప్రపంచమే నివ్వెరపోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలో ఒక రోబో ఇటీవల ‘ఆత్మహత్య’ చేసుకుంది. 

గుమీ నగరంలోని సిటీ హాల్ ఆఫీసులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఒక రోబో ఉద్దేశపూర్వకంగానే రెండు మీటర్ల పొడవున్న మెట్ల మీద నుంచి దూకింది. ఏమాత్రం కదలికలు లేని స్థితిలో దాన్ని గుర్తించారు. తనను తాను అంతం చేసుకొనే ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని.. ఒకేచోట అదేపనిగా గుండ్రంగా తిరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధిక పనిభారం లేదా యంత్రంలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను దేశంలోనే తొలి రోబో ఆత్మహత్యగా స్థానిక మీడియాతోపాటు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.

అయితే ఈ ఘటనను ‘ఆత్మహత్య’గా పేర్కొనడం నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే.. రోబోకు భావోద్వేగాలకు గురయ్యే లేదా తనను తాను అంతం చేసుకొనే సామర్థ్యం ఉండనందున ఇది ఎలా జరిగి ఉండొచ్చన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రోబో కదలికలకు దోహదపడే నేవిగేషన్ లో లోపాలు, సెన్సార్ల వైఫల్యం, ప్రోగ్రామింగ్ లో బగ్ వల్ల రోబో ఇలా విచిత్రంగా ప్రవర్తించి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది.

రోబో సూపర్ వైజర్ గా అందరూ పిలిచే ఆ మర యంత్రం 2023 ఆగస్టు నుంచి సేవలు అందిస్తోంది. ఆదర్శ ఉద్యోగిగా పనిచేస్తూ అందరి ప్రశంసలు పొందుతోంది. సివిల్ సర్వీస్ ఆఫీసర్ పేరిట దానికి ఓ ఐడీ కార్డు కూడా ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు రోజువారీ పత్రాల బట్వాడా, స్థానికులు కోరే సమాచారం వెల్లడి, నగర ప్రమోషన్ వంటి కార్యకలాపాలను రోబో చురుకుగా చేసేదని ఓ అధికారి తెలిపారు. సాధారణ రోబోలు ఒకే అంతస్తులో పనిచేసేలా తయారవగా ఈ రోబో మాత్రం సొంతంగా లిఫ్ట్ ఉపయోగించి వివిధ అంతస్తుల మధ్య సొంతంగా తిరిగేలా తయారైంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతానికి మరో రోబో సేవలను వినియోగించే ఉద్దేశం లేదని గుమీలోని సిటీ కౌన్సిల్ తెలిపింది.

క్యాలిఫోర్నియాకు చెందిన రోబో వెయిటర్ స్టార్టప్ సంస్థ బేర్ రొబోటిక్స్.. ఈ రోబోను తయారు చేసింది. రోబో తనను తాను అంతం చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పారు. ముక్కలైన రోబోను సేకరించామని.. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తామని వివరించారు. 

ప్రపంచంలోకెల్లా దక్షిణ కొరియాలోనే అత్యధికంగా రోబోలను వినియోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రొబోటిక్స్ ప్రకారం దక్షిణ కొరియాలో ప్రతి 10 మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక రోబో పనిచేస్తోంది.
Robot
Suicide
South Korea
Gumi City Council
Plunge
from Stairs

More Telugu News