Nara Lokesh: కడప జిల్లాలో ప్రైవేటు స్కూలు పైకప్పు కూలి విద్యార్థులకు గాయాలు... మంత్రి నారా లోకేశ్ స్పందన
- అక్కాయపల్లిలో సాయిబాబా స్కూల్ లో ప్రమాదం
- 8వ తరగతి క్లాస్ రూమ్ లో పైకప్పు పెచ్చులు ఊడిపడిన వైనం
- ఆరుగురు విద్యార్థులకు గాయాలు
- ఈ ఘటన తనను కలచివేసిందన్న మంత్రి నారా లోకేశ్
- స్కూలు యాజమాన్యంపై చర్యలకు ఆదేశాలు
కడప జిల్లా అక్కాయపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడిపడడంతో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సాయిబాబా హైస్కూల్ లోని 8వ తరగతి క్లాస్ రూమ్ లో ఈ ఘటన జరిగింది.
కాగా, ఈ పాఠశాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించినదని తెలుస్తోంది.
ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "కడప జిల్లా అక్కాయపల్లిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పైకప్పు కూలి ఆరుగురు విద్యార్థులు గాయపడిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. సంబంధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించాను. నిబంధనలు పాటించకుండా స్కూలు నడుపుతున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను" అంటూ నారా లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.