Rahul Gandhi: రేపు 'నీట్' పై మాట్లాడదాం... చర్చ ఏర్పాటు చేయండి: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
- ఇటీవల నీట్ పేపర్ లీక్
- 24 లక్షల నీట్ ఆశావహులు జవాబు కోరుతున్నారన్న రాహుల్
- పార్లమెంటులో చర్చకు ప్రధాని మోదీ చొరవ చూపాలని విజ్ఞప్తి
లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నీట్ పై రేపు (జులై 3) లోక్ సభలో చర్చ ఏర్పాటు చేయాలని మోదీని కోరారు. ఇటీవలి పరిణామాలపై ప్రభుత్వం నుంచి జువాబు కోరుతున్న 24 లక్షల మంది నీట్ ఆశావహుల ప్రయోజనాల కోసం నిర్మాణాత్మక రీతిలో పోరాడడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ చర్చకు మీరు నాయకత్వం వహించడం సబబుగా ఉంటుందని ప్రధాని మోదీని ఉద్దేశించి తన లేఖలో పేర్కొన్నారు.
జూన్ 28 నాడు నీట్ అంశంపై ఉభయ సభల్లో చర్చ జరగాలని విపక్షం కోరితే నాడు తిరస్కరించారని వెల్లడించారు. అయితే నిన్న లోక్ సభలో గౌరవనీయ స్పీకర్ ఈ నీట్ అంశంపై చర్చ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. నీట్ అభ్యర్థుల కోసం లక్షలామంది కుటుంబాల వారు అనేక త్యాగాలు చేశారని, కానీ నీట్ పేపరు లీక్ కావడం అంటే వారి జీవితకాల స్వప్నం భగ్నం కావడమేనని స్పష్టం చేశారు.
"ఇవాళ నీట్ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధుల వైపే చూస్తున్నారు... సమస్య పరిష్కారానికి ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. నీట్ పేపర్ లీకేజి అంశం దేశ ఉన్నత విద్యా వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతిని బట్టబయలు చేసింది. గత ఏడేళ్లలో 70 సార్లు పేపర్ లీకైంది. 2 కోట్ల మంది విద్యార్థులపై ఆ ప్రభావం పడింది.
ఇతర పరీక్షలను వాయిదా వేయడం, ఎన్టీయే డైరెక్టర్ జనరల్ ను మార్చడం వంటి చర్యలు కేంద్ర పరీక్షల వ్యవస్థలోని డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అన్నట్టుగా ఉన్నాయి. మన విద్యార్థులకు సమాధానం కావాలి. వారిలో మళ్లీ విశ్వాసం కలిగించేందుకు పార్లమెంటులో చర్చ తొలి అడుగు కావాలి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేపు పార్లమెంటులో చర్చ ఏర్పాటు చేయండి. అందుకు ప్రధాని హోదాలో మీరు ముందుకు వస్తే విద్యార్థుల ప్రయోజనాల పట్ల ఒక భరోసా ఇచ్చినట్టవుతుంది" అని రాహుల్ గాంధీ తన లేఖలో వివరించారు.