Narendra Modi: కాంగ్రెస్ పార్టీపై లోక్ సభలో నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ... ఫుల్ స్పీచ్ ఇదిగో!
- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
- లోక్ సభలో బదులిచ్చిన ప్రధాని మోదీ
- కాంగ్రెస్ పార్టీని ప్రజలు మూడు సార్లు ఓడించినా బుద్ధి రాలేదని వెల్లడి
- పిల్ల చేష్టల దశ నుంచి బయటికి రావాలని కాంగ్రెస్ నేతలకు హితవు
లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో అత్యధిక భాగం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. గతంలో బొగ్గు విషయంలో అంతులేని అవినీతి జరిగేదని అన్నారు. 2014కి ముందు బొగ్గు కుంభకోణాలకు లెక్కే లేదని విమర్శించారు. ఇతర రంగాల్లోనూ స్కాములు చోటుచేసుకున్నాయని తెలిపారు. 2014కి ముందు దోషులు చట్టం నుంచి తప్పించుకునేవారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని, 2014 తర్వాత దోషుల ఇళ్ల వద్ద కూడా బుల్లెట్ల వర్షం కురిసిందని మోదీ అన్నారు. తాము వచ్చాక తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపామని స్పష్టం చేశారు.
ఎన్డీయే రాకతో బ్యాంకు ప్రతిష్ఠ పెరిగిందని వెల్లడించారు. తాము చేపట్టిన చర్యలతో ప్రపంచవ్యాప్తంగా మన బ్యాంకులపై విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో 370 ఆర్టికల్ తొలగించాక అక్కడ శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందని ప్రధాని మోదీ వివరించారు. 370 ఆర్టికల్ ఎత్తివేశాక జమ్మూ కశ్మీర్ లో రాళ్ల దాడులు తగ్గిపోయాయని వెల్లడించారు. తాము వచ్చాక దేశంలో తుప్పు పట్టిన చట్టాలను రద్దు చేశామని తెలిపారు.
"దేశం మరింత ముందుకు వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్డీయే పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకువెళ్లాం. మున్ముందు భారత్ ను మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం... అదే మా లక్ష్యం! ఆత్మనిర్భర్ భారత్ ను సాకారం చేసుకుంటున్నాం. సెల్ ఫోన్లను మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం. చిప్స్, సెమీకండక్టర్ల ఉత్పాదనలో గణనీయమైన వృద్ధిని సాధించాం.
దేశంలో పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం. పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నాం. మా పదేళ్ల పాలనలో మహిళా సంఘాలను బలోపేతం చేశాం. మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాం. వచ్చే ఐదేళ్లలో మూడింతల వేగంతో పనిచేస్తాం... దేశ ప్రజలకు మూడింతల లబ్ధి చేకూర్చుతాం. మా పాలన బాగుందని, మేం చేస్తున్న పనులు ప్రయోజనకరంగా ఉన్నాయనే ప్రజలు ఎన్డీయే కూటమికి మూడోసారి అవకాశం ఇచ్చారు.
లోక్ సభ ఎన్నికలతో పాటు జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి సత్తా చాటింది. ఒడిశాలో జగన్నాథస్వామి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం... ఆంధ్రప్రదేశ్ లో మా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇలా... అనేక రాష్ట్రాల ప్రజలు మా పాలన కోరుకుంటున్నారు. కేరళలోనూ మా పార్టీ ఖాతా తెరిచింది. తమిళనాడులోనూ మా ఓటు శాతం పెరిగింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, హర్యానా రాష్ట్రాల ప్రజలు మా వెంటే ఉన్నారు.
ఈసారి కూడా కాంగ్రెస్ ను పక్కన కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. సభలో నినాదాలు చేయడమే మీ పని అని మూడోసారి కూడా కాంగ్రెస్ కు దేశ ఓటర్లు నిర్దేశించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి ఇంకా శీర్షాసనాలు వేస్తున్నారు. అర్థంపర్థంలేని నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళనను, వృథా ప్రయాసను దేశ ప్రజలంతా చూస్తున్నారు. 99 సీట్లు వచ్చినందుకే కాంగ్రెస్ నేతలు స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ కు వచ్చింది 100కి 99 సీట్లు కాదు... 543కి 99 సీట్లు.
వరుసగా మూడోసారి ఓడిపోయినా కూడా కాంగ్రెస్ లో మార్పు రాలేదు. దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావడంలేదు. ఇకనైనా ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలను కోరుతున్నాను. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే ఎన్నికల ఫలితాలను వారు ఏమాత్రం సమీక్షించుకున్నట్టు కనిపించడంలేదు. బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోరాటంలో కాంగ్రెస్ స్ట్రయిక్ రేట్ 26 శాతం మాత్రమే. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాల స్ట్రయిక్ రేట్ 50 శాతంగా ఉంది. 16 రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఓట్ల శాతం దారుణంగా పడిపోయింది. మిత్రపక్షాలు చేసిన సాయం వల్లే కాంగ్రెస్ కు అన్ని సీట్లయినా వచ్చాయి. ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కు గతంలో వచ్చిన సీట్లే వచ్చేవి.
6 దశాబ్దాల కాంగ్రెస్ పాలన చూస్తే అరాచకం, అవినీతి తప్ప ఇంకేముంది? దేశం నలుమూలలా కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది. భాషలు, ప్రాంతాలు, వర్గాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టింది. కాంగ్రెస్ నిర్వాకంతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. కాంగ్రెస్ పెద్దల మనసులో ఒకటుంటే... పైకి మరొకటి చెబుతారు. ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో హింస రాజేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతలు రాజకీయాలు ఏనాడూ దేశ హితం దిశగా సాగలేదు.
ఇప్పుడు దేశ ప్రజల సానుభూతి కోసం కాంగ్రెస్ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. ఓబీసీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. వీరసావర్కార్ పైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. చిన్నపిల్లల చేష్టలను ప్రజలు పట్టించుకోరన్న విషయాన్ని కాంగ్రెస్ గ్రహిస్తే మంచిది.
అబద్ధాలతో చేసే రాజకీయాలు ఎన్నాళ్లు కొనసాగుతాయి? మొదటి ఎన్నికల్లో ఈవీఎంలపై బురద చల్లారు... ఆ తర్వాత రాజ్యాంగం, రాఫెల్ యుద్ధ విమానాల డీల్, రిజర్వేషన్లపైనా దుష్ప్రచారం చేశారు. ఎల్ఐసీ, బ్యాంకులు, అగ్నివీర్ అంశాలపైనా అబద్ధాలు చెప్పారు. రైతులకు ఎంఎస్ పీ ఇవ్వడంలేదని తప్పుడు ప్రచారం చేశారు. ఇలాంటి అబద్ధాలను ప్రజలు నమ్ముతారనుకుంటే ఎలా? అందుకే కాంగ్రెస్ నేతల అబద్ధాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు.
విపక్ష నేతల ప్రవర్తన సభ హుందాతనానికి తగినట్టుగా లేదు. వారు ఇకనైనా చిన్నపిల్లల మనస్తత్వం వీడాలి. పార్లమెంటులో ఇలాంటి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదు. ఎస్సీ, ఎస్టీ, ఇతర పీడిత వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ అని అంబేద్కర్ ఆనాడే చెప్పారు. నెహ్రూ ప్రభుత్వ విధానాలు నచ్చక అంబేద్కర్ రాజీనామా చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అంబేద్కర్ ను ఓడించింది. జగజ్జీవన్ రామ్ ప్రధాని కాకుండా అడ్డుపడింది కూడా కాంగ్రెస్ పార్టీనే.
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకం. నాడు రిజర్వేషన్లపై నెహ్రూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాశారు. ఇప్పుడు దేశంలోని హిందువులపై దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. హిందూ ఉగ్రవాదం అనే మాటను ప్రచారం చేస్తున్నారు. హిందువులు ఎప్పుడూ హింసను ప్రోత్సహించరు... హిందువులు హింసకు వ్యతిరేకం. హిందువులను అవమానించిన కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎన్నటికీ క్షమించరు. దేశంలో ప్రతి వ్యక్తి ఈశ్వర రూపంగా హిందువులు భావిస్తారు. కానీ, భక్తిశ్రద్ధలతో పూజించే దేవతలను, అమ్మవార్లను కాంగ్రెస్ నేతలు తూలనాడారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి.
కాంగ్రెస్ నేతలు దేశ సైనిక వ్యవస్థను కూడా విమర్శిస్తున్నారు. సైనికుల మనోబలాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వైఖరి ఉంది. రాఫెల్ యుద్ధవిమానాలు ఆటబొమ్మలని ఎగతాళి చేశారు" అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ ను తూర్పారబట్టారు.
సైనికుల ఆత్మవిశ్వాసం పెంచేలా మా చర్యలు ఉంటాయని,. ఎలాంటి ఆపద వచ్చినా తట్టుకోలిగే రీతిలో సైనిక వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని వెల్లడించారు. రక్షణ రంగంలో సమూల ప్రక్షాళన చేపడుతున్నామని తెలిపారు. దేశంలో అవినీతి, కుంభకోణాలు అనే మాట వినిపించకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.