Revanth Reddy: చంద్రబాబు లేఖపై స్పందించిన రేవంత్ రెడ్డి
- ఏపీ సీఎంకు ప్రత్యుత్తరం రాసిన తెలంగాణ సీఎం
- సమస్యలను పరిష్కరించుకుందామన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని వెల్లడి
- మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో కలుద్దామన్న తెలంగాణ సీఎం
- ఏపీలో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
విభజన అంశాలపై చర్చించుదామంటూ లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాశారు. చంద్రబాబు చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ ఆయన ఈరోజు లేఖ రాశారు. ఈ నెల 6న చర్చించుదామన్న చంద్రబాబు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. చర్చలకు ఏపీ సీఎంను ఆహ్వానించారు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని... పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకుందామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో కలుద్దామని తెలిపారు.
నిన్న మీరు పంపిన లేఖ అందిందని... దానిని చదివానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొదటగా ఏపీలో విజయం సాధించినందుకు కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతికొద్ది మందిలో మీరు ఉన్నారని ప్రశంసించారు.