Telangana: తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీ
- ఒక్కొక్కరు రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వులు
- విడుదలైన వారు ప్రతి మూడు నెలలకోసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశం
- విడుదలవుతున్న వారిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నవారే
తెలంగాణలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఒక్కొక్కరు రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. విడుదలైన వారు ప్రతి మూడు నెలలకు ఓసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని అందులో ఆదేశించింది.
విడుదలవుతున్న 213 మంది ఖైదీలలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నవారు ఉన్నారు. ఇదిలా ఉండగా, విడుదల కానున్న ఖైదీలకు ఉపాధి కల్పించాలని గవర్నర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పెట్రోల్ బంకులు వంటి చోట్ల ఉపాధి కల్పిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్ర బుధవారం మాట్లాడుతారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి లాంటి సందర్భాలలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు.