Snake Bite: పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా అతడు సేఫ్!

UP man survives five snake bites in 45 days

  • ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఘటన
  • ప్రతిసారి పాముకాటుతో ఆసుపత్రికి
  • సకాలంలో వైద్యం అందడంతో నిలిచిన ప్రాణాలు
  • వైద్యుల సూచనతో స్థలం మార్చినా వదలని పాము
  • ఈ ఘటనను వింతగా అభివర్ణించిన వైద్యులు

పాము పగబట్టడం మనం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. సర్పాలు అసలు పగబడతాయా? లేదా? అన్న వాదనను పక్కనపెడితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన ఓ వ్యక్తి 45 రోజుల్లో ఏకంగా ఐదుసార్లు పాముకాటుకు గురయ్యాడు. అయినప్పటికీ తక్షణం వైద్యసాయం అందడంతో అన్నిసార్లూ బతికి బయపడ్డాడు. ప్రతిసారీ పాముకాటుతో ఆసుపత్రికి వస్తున్న అతడిని చూసిన వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. 

గ్రామానికి చెందిన వికాస్ దూబే జూన్ 2న రాత్రి ఇంట్లో పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 10 తేదీన మరోమారు పాముకాటుకు గురయ్యాడు. ఈసారి కూడా మళ్లీ అదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. రెండుసార్లు పాము కాటేయడంతో ఈసారి అతడి వెన్నులో వణుకు మొదలైంది. జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాడు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారం రోజుల తర్వాత 17న దూబేను పాము మళ్లీ కాటేసింది. ఈసారి అతడు స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ అదే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే మరోమారు పాము అతడిని కాటేసింది. ఈసారి కూడా వైద్యులు అతడిని కాపాడారు. ప్రతిసారి పాముకాటుతో ఆసుపత్రికి వస్తున్న దూబేను చూసిన వైద్యులు సైతం నోరెళ్లబెట్టారు. ఇలా అయితే లాభం లేదని, ఈసారి అతడిని వేరే చోటికి పంపి కొన్ని రోజులు అక్కడే ఉంచాలని వైద్యులు, బంధువులు దూబే కుటుంబ సభ్యులకు సూచించారు.

వారి సూచన మేరకు ఎందుకైనా మంచిదని, గ్రామంలోనే ఉంటున్న బాధితుడి అత్తయ్య ఇంటికి అతడిని పంపారు. అయినప్పటికీ పాము అతడిని వదల్లేదు. అక్కడ కూడా ఐదోసారి అతడిని కాటేసింది. మళ్లీ ఆసుపత్రికి వచ్చిన దూబేకు సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలు నిలిచాయి. దూబేకు చికిత్స అందించిన డాక్టర్ జవహర్‌లాల్ మాట్లాడుతూ.. పాము ప్రతిసారి అతడినే కరవడాన్ని ‘వింత’గా అభివర్ణించారు. ప్రస్తుతం దూబే కోలుకున్నప్పటికీ పాము మళ్లీ తనపై ఎప్పుడు దాడిచేస్తుందోనని భయంభయంగా గడుపుతున్నాడు.

  • Loading...

More Telugu News