Gautam Gambhir: ఆ రాత్రంతా కన్నీరు పెట్టుకున్నా: గౌతం గంభీర్
- 1992 వరల్డ్ కప్ సమయంలో తనకు 11 ఏళ్లని చెప్పిన గంభీర్
- ఆ మ్యాచ్లో భారత్ ఒక పరుగు తేడాతో ఓడటంతో కన్నీరుమున్నీరయ్యానని వెల్లడి
- అంతటి భావోద్వేగం మరెప్పుడూ కలగలేదని వ్యాఖ్య
- భారత్కు ప్రపంచకప్ అందించాలని అప్పుడే నిర్ణయించుకున్నాన్న గంభీర్
భారతీయులకు క్రికెట్ ఓ మతం.. తీవ్రమైన భావోద్వేగం! భారత్ గెలిస్తే వచ్చే ఆనందం, ఒడితే కలిగే వ్యధ మాటలకు వర్ణనాతీతం. ఇక టీమిండియా స్ఫూర్తిగా అనేక మంది యువత క్రికెట్లో కాలుపెట్టారు. అయితే, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ పదవికి పోటీ పడుతున్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ చిన్నతనంలో తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. 1992లో ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా తాను తీవ్ర భావోద్వేగానికి లోనైనట్టు చెప్పుకొచ్చాడు. నాటి మ్యాచ్లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
‘‘అప్పటికి నాకు 11 ఏళ్లు. మ్యాచ్ చూసి ఆ రాత్రంతా నేను కన్నీరుమున్నీరయ్యాను. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని, భారత్కు ప్రపంచకప్ అందించాలని నిర్ణయించుకున్నాను. 1992లో నేను చేసిన ప్రతిన 2011లో నెరవేరింది. ఆ తరువాత కూడా అనేక సార్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను కానీ కన్నీరుపెట్టుకోలేదు. నాటి మ్యాచ్లో వెంకటపతి రాజు రన్ అవుట్ అవడంతో భారత్ ఒకే ఒక పరుగు తేడాతో ఓడిపోయింది’’ అని చెప్పుకొచ్చాడు. బ్రిస్బేన్లో జరిగిన నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. వానతో ఆటకు ఆటంకం ఏర్పడడంతో భారత్కు 235 పరుగుల సవరించిన టార్గెట్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో చివరి వరకూ పోరాడిన భారత్ ఒక్క పరుగు తేడాతో కప్పు చేజార్చుకుంది.
ఇక 2007లో ఐసీసీ టీ20 ఫైనల్స్లో అద్భుతంగా పరుగులు రాబట్టిప గంభీర్.. టీమిండియా 2011 ప్రపంచకప్ టైటిల్ గెలుపులో ధోనీతో కలిసి కీలకపాత్ర పోషించాడు.