Chandrababu: బుద్ధి, జ్ఞానం ఉంటే అమరావతిని వ్యతిరేకించడు: రాజధానిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల
- అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్న చంద్రబాబు
- అమరావతిపేరుకు అందరూ అంగీకరించారన్న ఏపీ సీఎం
- సైబరాబాద్‌ను నిర్మించి అభివృద్ధి చేశానన్న చంద్రబాబు
- ల్యాండ్ పూలింగ్‌లో విన్ విన్ పద్ధతిని అవలంబించానని వెల్లడి
- సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్న ఏపీ సీఎం
రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే... జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.
అమరావతి పేరుకు అందరూ అంగీకరించారు
రామోజీరావు కూడా రీసెర్చ్ చేసి తనకు అమరావతి పేరునే సూచించారన్నారు. దీనికి కేబినెట్ నుంచి ప్రజల వరకు అందరి ఆమోదం లభించిందన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టిని, అలాగే దేశంలోని ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీరు, మట్టిని తీసుకువచ్చామన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా యమునా నీటిని, మట్టిని తీసుకువచ్చారన్నారు. అమరావతికి ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారని... రాజధానికి సహకరిస్తామని చెప్పారన్నారు. అమరావతికి కేంద్రం సహకారం ఉంటుందని హామీ ఇచ్చారన్నారు.
బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి వ్యతిరేకించడు
అమరావతి చరిత్ర సృష్టించే నగరమన్నారు. శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు. అందుకే దీనిని రాజధానిగా నిర్ణయించినట్లు చెప్పారు. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తాడన్నారు. బ్రిటిష్ మ్యూజియంలో అమరావతికి ఓ గ్యాలరీ ఉందన్నారు.
సైబరాబాద్‌ను నిర్మించాను
తాను ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు ఉండగా... తాను వచ్చాక సైబరాబాద్‌ను నిర్మించానన్నారు. తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌కు ఒక ఎకోసిస్టంను తయారు చేశామన్నారు. పద్ధతి ప్రకారం... ప్రణాళిక ప్రకారం ఈ నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. హైటెక్ సిటీని అభివృద్ధి చేయడం కోసం తాను ఆ రోజు 14 రోజుల పాటు అమెరికాలో ఉన్నానని... కంపెనీలను తీసుకువచ్చానన్నారు. ఆ తర్వాత పరిశ్రమలను కూడా తెచ్చానన్నారు. ఇప్పుడు సైబరాబాద్ ఒక చరిత్ర అన్నారు. హైదరాబాద్‌లో తాను రాక్ గార్డెన్‌ను ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ సైబరాబాద్ మహా నగరం ఎలా ఉండేదో చెప్పడానికి రాక్ గార్డెన్ ఏర్పాటు చేశానన్నారు.
ల్యాండ్ పూలింగ్‌లో విన్ విన్ పద్ధతి
తాను చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా విన్-విన్ పద్ధతిలోనే ముందుకు సాగామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారు కూడా సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. శంషాబాద్ తదితర ప్రాంతాల్లో అలాగే ముందుకు సాగామని చెప్పారు. అమరావతిలోనూ అదే విధంగా ల్యాండ్ పూలింగ్ నిర్వహించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ అమరావతిదే అన్నారు. వరల్డ్ బ్యాంక్ దీనిని ఓ కేస్ స్టడీగా చూపించిందన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా రాజధానికి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగేలా వ్యవహరించామన్నారు.
సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది
రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని జగన్ ఆనాడు చెప్పారని... ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారని... కానీ ఆ తర్వాత ఆయన ఏం చేశారో అందరూ చూశారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి బ్యాంకులు ముందుకు వచ్చి... మన రాజధాని ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చారన్నారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్నారు. సింగపూర్‌తో ఎంవోయూ కూడా కుదుర్చుకున్నట్లు చప్పారు. సీడ్ క్యాపిటల్ ఏరియాతో పూర్తి వివరాలతో మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 9 నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామన్నారు.