Chandrababu: మళ్లీ ఉచిత ఇసుక విధానం: చంద్రబాబు కీలక నిర్ణయం
- ఈ నెల 8వ తేదీ నుంచి అమలు చేయాలని దాదాపు నిర్ణయం
- ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నట్లు మంత్రి వెల్లడి
- ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయించినట్లు కొల్లు రవీంద్ర వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని దాదాపు నిర్ణయించారు. ఐదేళ్ల క్రితం నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని ఇప్పుడు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి.. ఆ కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా చార్జీలను నిర్ణయించనున్నారు.
ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు: కొల్లు రవీంద్ర
ఇసుక విధానంతో ఐదేళ్ళుగా పేద ప్రజలను దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇసుక నిల్వ కేంద్రాలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుందని ఆరోపించారు.
ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వర్షాలు పడినా ఇసుక పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక పంపిణీలో సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటామన్నారు