Myanmar: ఉద్యోగుల జీతాలు పెంచినందుకు యజమానుల అరెస్టు.. మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం.. ఎక్కడంటే..!
- పదిమంది షాపు ఓనర్లను జైలుకు పంపిన మయన్మార్ మిలటరీ ప్రభుత్వం
- దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంటే ఉద్యోగుల జీతాలు పెంచడంపై ఆగ్రహం
- మిలటరీ పాలనలో చట్టాలు నామమాత్రమేనంటూ ఓ లాయర్ విమర్శలు
షాపులో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచిన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పని చేశారంటూ పది మంది షాపు ఓనర్లను మిలటరీ కోర్టు ముందు నిలబెట్టారు. నేరం నిరూపణ అయితే ఆ పదిమందికీ ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు చెబుతున్నారు. మన పొరుగు దేశం మయన్మార్ లో చోటుచేసుకుందీ ఘటన. గతంలో బర్మాగా వ్యవహరించిన మయన్మార్ దేశంలో ప్రస్తుతం మిలటరీ పాలన కొనసాగుతోంది.
మయన్మార్ లో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో సైనిక పాలనపై ప్రజల్లో తిరుగుబాటు రేగే అవకాశం ఉందని మిలటరీ భయపడుతోందని, ఎక్కడికక్కడ కఠినంగా వ్యవహరిస్తోందని అక్కడి లాయర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల జీతాలు పెంచిన పదిమంది షాప్ యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయా షాపుల ముందు ‘సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు షాపు యజమానిని అరెస్టు చేయడమైనది’ అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఈ ఘటనపై మయన్మార్ న్యాయ నిపుణులు పలువురు విమర్శలు గుప్పించారు.
వాస్తవానికి దేశంలో జీతాలు పెంచడంపై ఎలాంటి నిషేదం లేదన్నారు. అయితే, ఇలా ఉద్యోగుల జీతాలు పెంచడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరగనుందని ప్రజలు ఆందోళన చెందుతారని మిలటరీ పాలకులు భావించారని తెలిపారు. దీనిని మొగ్గలోనే తుంచేయడానికి, ఇతర షాపుల యజమానులకు హెచ్చరికగా ఈ పదిమందిని అరెస్టు చేశారని అంటున్నారు. మిలటరీ పాలనలో చట్టాలు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయని, పాలకులు చేసిందే చట్టం, పాటించిందే న్యాయం అన్నట్లు సాగుతోందని మరో లాయర్ విమర్శించారు. మరోవైపు, తమ జీతాలు పెరిగాయని సంతోషించే లోపే ఉన్న ఉద్యోగం కూడా పోయిందని, ఇప్పుడు మొత్తానికే ఉపాధి లేకుండా అయిందని ఉద్యోగులు వాపోతున్నారు.