NVSS Prabhakar: మంచిదే కదా..!: చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానుండటంపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- సీఎంల సమావేశంలో పరిష్కారం కాని ఉమ్మడి సమస్యలు చర్చకు వస్తాయని వెల్లడి
- రేవంత్ రెడ్డికి ఇంకా ఢిల్లీ యాత్రలతోనే సరిపోతోందని ఎద్దేవా
- కేబినెట్ విస్తరణ కోసం ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య
ఎల్లుండి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానుండటంపై తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పందించారు. గురువారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం మంచిదే అన్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో పరిష్కారం కాని ఉమ్మడి సమస్యలు చర్చకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతోందని... కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీ యాత్రలు చేయడంతోనే సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలనాపరమైన అంశాలపై ఆయన పట్టు సాధించలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇది పాత సంప్రదాయమే అన్నారు. ఆ పార్టీ అధినాయకత్వం అందరి ముందటి కాళ్లకు బంధం వేస్తుందన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని విమర్శించారు. హత్యలు, అత్యాచారాలు, అరాచకత్వం పెరిగిందని ధ్వజమెత్తారు.