Revanth Reddy: టాలీవుడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి 'షరతు'పై స్పందించిన దిల్ రాజు!
- డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వానికి అండగా ఉంటామన్న టీఎఫ్‌సీసీ
- ఇలాంటి అంశాల్లో చిత్ర పరిశ్రమ గతంలో ముందుండి నడిపించిందని వెల్లడి
- త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్న టీఎఫ్‌సీసీ
డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు వ్యతిరేకంగా టాలీవుడ్ అవగాహన వీడియోలు తీయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షరతుపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) స్పందించింది. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శులు దామోదర ప్రసాద్, కే శివప్రసాదరావు వెల్లడించారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై సానుకూలంగా స్పందించారని గుర్తు చేసుకున్నారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై సినీ రంగ ప్రముఖులు, సినిమా థియేటర్ యాజమాన్యాలు తమ వంతుగా కృషి చేయాల్సిందే అన్నారు. ఇలాంటి అంశాల్లో చిత్ర పరిశ్రమ గతంలోనూ ముందుండి నడిపించిందని తెలిపారు. పరిశ్రమకు చెందిన వారంతా డ్రగ్స్, సైబర్ నేరాలు అరికట్టే విషయంలో తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో సీఎంను కలుస్తామని తెలిపారు.