Vangalapudi Anitha: ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి?: హోంమంత్రి అనిత

Home Minister Vangalapudi Anitha slams Jagan
  • నేడు నెల్లూరు జైల్లో పిన్నెల్లిని కలిసి పరామర్శించిన వైసీపీ అధినేత జగన్
  • పిన్నెల్లిని కలవడానికి జగన్ రూ.25 లక్షలు పెట్టి హెలికాప్టర్లో వచ్చారన్న అనిత
  • మానవతా దృక్పథంతో జగన్ కు ములాఖాత్ అనుమతి ఇచ్చామని వెల్లడి
నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. 

అమరావతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈవీఎం పగులగొట్టిన పిన్నెల్లిని కలిసేందుకు జగన్ ఇవాళ రూ.25 లక్షలు ఖర్చు చేశారని వెల్లడించారు. జైల్లో ఉన్న పిన్నెల్లి కోసం జగన్ హెలికాప్టర్ లో నెల్లూరు వెళ్లారని వివరించారు. అయితే, పిన్నెల్లి ములాఖాత్ లు అయిపోయినప్పటికీ, మానవతా దృక్పథంతో జగన్ కు అనుమతి ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. ములాఖాత్ లు అయిపోయాయని తెలిసి కూడా జగన్ ఉద్రిక్తతలు రగిల్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. 

"ఈవీఎం బద్దలు కొట్టడం, హత్యాయత్నం వంటి అంశాల్లో పిన్నెల్లి పక్కా ఆధారాలతో దొరికిపోయారు. ఆయన అరెస్ట్ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ ఖైదీని కలవాలని నిర్ణయించుకున్నారు... అది ఆయన ఇష్టం. డబ్బుంది కాబట్టి పాతిక లక్షలు ఖర్చుపెట్టుకుని నెల్లూరు వెళ్లారు. పిన్నెల్లికి ములాఖాత్ లు అయిపోయినప్పటికీ, మేం మానవతా దృక్పథంతో ఆలోచించి అనుమతి ఇచ్చాం. 

నాడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు మూడో ములాఖాత్ ఇచ్చేవారు కాదు. కానీ ఇవాళ తనకు అనుమతి లేదని తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అక్కడ గలాటా సృష్టించడానికే అనుకోవాలా? 

మేం ఇవాళ రూల్స్ పట్టించుకోకుండా మానవతా కోణంలో అనుమతి మంజూరు చేశాం. కానీ జగన్ జైలు నుంచి బయటికి వచ్చి, అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారు. సీసీ టీవీ ఫుటేజి చూసినవారెవరైనా అక్రమ అరెస్ట్ అంటారా? అతడ్ని అరెస్ట్ చేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. 

మేం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే, వాటిని దాడులు అని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి మీరు ఐదేళ్ల కిందట పాలన మొదలుపెట్టినప్పటి నుంచి చేసిన వాటిని ఏమనాలి? ప్రజావేదిక కూల్చివేత నుంచి మీరు చేసినవి ఏమిటి... దాడులు కాదా...? నా మీదే 23 కేసులు పెట్టారు. మేం కక్ష తీర్చుకోవాలనుకుంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఇవాళ వచ్చి ప్రతీకార దాడులు అంటూ రెచ్చగొడుతున్నారా?" అంటూ అనిత ధ్వజమెత్తారు.
Vangalapudi Anitha
Jagan
Pinnelli Ramakrishna Reddy
Nellore Jail
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News