YSR: వైఎస్సార్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించబోతున్నాం: పేర్ని నాని
- జులై 8న వైఎస్సార్ జయంతి
- రాష్ట్ర వ్యాప్త వేడుకలకు వైసీపీ సంసిద్ధం
- వైసీపీ శ్రేణులు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలన్న పేర్ని నాని
- వైఎస్ 75వ జయంతి వేడుకల నిర్వహణకు కాంగ్రెస్ కూడా సన్నద్ధం
జులై 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ జయంతి రోజున వైసీపీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, రక్తదానం, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. వైఎస్సార్ ను ఆరాధించేవాళ్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆ మేరకు జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు. వైఎస్సార్ ఆశయాలు, సిద్ధాంతాల స్ఫూర్తితోనే వైసీపీ ఏర్పడిందని... వైఎస్సార్ భావజాలం ఆధారంగానే పార్టీ ముందుకు నడుస్తోందని వివరించారు.
అటు, ఏపీ కాంగ్రెస్ కూడా వైఎస్ 75వ జయంతి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. విజయవాడలో జరిగే కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ప్రముఖులు, కర్ణాటక కాంగ్రెస్ నేతలు కూడా హాజరు కానున్నారు.
వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు రావాలంటూ షర్మిల ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను కూడా ఆహ్వానించారు.