Revanth Reddy: ఆంధ్రప్రదేశ్లో 'అధికార మార్పిడి'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- ఏపీలో అయిదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందని వ్యాఖ్య
- తెలంగాణలో పదేళ్ళకోసారి మారుతుందని జోస్యం
- ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో అయిదేళ్లకోసారి... తెలంగాణలో పదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. 2029 వరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని... ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు.
కేకే సేవలను వినియోగించుకుంటాం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందుతోందన్నారు. గతంలో అధికారంలో ఉన్నవారు ఫ్యామిలీ పబ్లిసిటీ చేశారని... కానీ తాము అలా చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత కే కేశవరావు సేవలను వినియోగించుకుంటామన్నారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ రోజున రిజర్వులో ఉండే 15 శాతం ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందన్నారు. వాటిని అటు ఇటు మారిస్తే ఎవరికీ తెలిసే అవకాశమే లేదన్నారు.
మూసీ నది సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా పెట్టుకున్నట్లు చెప్పారు. 55 కిలో మీటర్ల మేర మూసీ నదిపై రోడ్డు, రైళ్లు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో నిరాశ్రయులయ్యే 10 వేల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలనలో తనదైన ముద్ర వేస్తానన్నారు.