Team India: వాంఖెడే స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లకు ఘనంగా సన్మానం
టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు నేడు ముంబయిలో అపూర్వ రీతిలో ఆదరణ లభించింది. ఇక్కడి మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లను ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా వాంఖడే స్టేడియానికి తీసుకువచ్చారు. అభిమానులు అంచనాలకు మించి తరలిరావడంతో మెరైన్ డ్రైవ్ ప్రాంతం జనసునామీని తలపించింది.
బస్ పై నిలుచున్న ఆటగాళ్లు ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ ను చేతబూని అభిమానులకు మరింత సంతోషం కలిగించారు. ఇక, వాంఖెడే స్టేడియం చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు మైదానంలో డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
కాగా, ఆటగాళ్లు పరేడ్ గా వస్తున్న సమయంలో... మెరైన్ డ్రైవ్ రోడ్డులో ఉన్న ఓ చెట్టుపై ఉన్న అభిమానిని చూసి టీమిండియా ఆటగాళ్లు ఉలిక్కిపడ్డారు. అతడు చీకట్లో, ఆ చెట్టు కొమ్మపై ఉండడంతో ఆటగాళ్లు కాస్త భయపడ్డారు.
టీమిండియాకు రూ.125 కోట్ల నజరానా
వాంఖెడే స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లను ఘనంగా సత్కరించారు. వారికి బీసీసీఐ రూ.125 కోట్ల నజరానా అందించింది. టీమిండియా క్రికెటర్లు మైదానంలోకి ప్రవేశించగానే, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
ఈ ట్రోఫీ యావత్ భారతదేశానికి చెందుతుంది: రోహిత్ శర్మ
వరల్డ్ కప్ గెలిచి భారత్ చేరుకున్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా తమకు అద్భుతమైన స్పందన వస్తోందని రోహిత్ శర్మ తెలిపాడు. ప్రజలు తమ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూడడం సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. ఈ కప్ టీమిండియాకు చాలా ముఖ్యమైనదని, అయితే ఈ కప్ యావత్ భారతావనికి చెందుతుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ అంత ఎమోషనల్ కావడం ఎప్పుడూ చూడలేదు: విరాట్ కోహ్లీ
ముంబయి వాంఖెడే స్టేడియంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... రోహిత్ శర్మ, తాను గత 15 ఏళ్లుగా కలిసి ఆడుతున్నామని, అయితే, మొదటిసారిగా రోహిత్ శర్మ ఎంతో ఎమోషనల్ కావడం చూశానని వెల్లడించాడు. రోహిత్ శర్మ ఏడుస్తున్నాడు, నేను కూడా ఏడుస్తున్నాను... మా ఇద్దరి మధ్య ఎన్నో భావోద్వేగాలు ఉప్పొంగాయి... టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ను ఎప్పటికీ మర్చిపోను అంటూ కోహ్లీ వివరించాడు.
నా జీవితంలో బెస్ట్ ఫోన్ కాల్స్ లో అదొకటి: ద్రావిడ్
టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ... గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి తర్వాత కోచ్ గా తప్పుకుందామని అనుకున్నానని వెల్లడించాడు. అయితే, మనం మరొక్కసారి కలిసి పనిచేద్దామా అంటూ రోహిత్ శర్మ ఫోన్ చేసి మాట్లాడాడని, తన జీవితంలో బెస్ట్ ఫోన్ కాల్స్ లో అదొకటి అని ద్రావిడ్ వివరించాడు.