Devineni Uma: పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టాడన్న జగన్ వ్యాఖ్యలను సాక్ష్యంగా తీసుకోవాలి: దేవినేని ఉమ

Case Should File Against YS Jagan On His EVM Comments Devineni Uma Demands
  • రాజ్యాంగ వ్యవస్థలను ధిక్కరించడాన్ని సమర్థించిన జగన్‌పై కేసు పెట్టాలన్న టీడీపీ నేత
  • పల్నాడును చంబల్‌లోయలా మార్చి అరాచకాలు చేసేవారు మంచివారు ఎలా అవుతారని ప్రశ్న
  • సూపర్-6లోని హామీలన్నింటినీ నెరవేరుస్తామన్న దేవినేని
ఈవీఎంను పగలగొట్టడం నేరం కాదన్నట్టు చెప్పడమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థలను ధిక్కరించడాన్ని సమర్థించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. తమ నేత (పిన్నెల్లి రామకృష్ణారెడ్డి) ఈవీఎంను పగలగొట్టాడన్న జగన్ వ్యాఖ్యలను సాక్ష్యంగా పరిగణించాలని కోరారు. 

ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదు కాబట్టే ఈవీఎంను పగలగొట్టాడని, అది నేరంకాదన్నట్టు జగన్ చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో చంబల్‌లోయ మాదిరిగా అరాచకాలు చేసేవాళ్లు మంచివాళ్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆయన మంచోడైతే కుటుంబాలకు కుటుంబాలు గ్రామాలు వదిలి ఎందుకు వెళ్తాయని నిలదీశారు. అలా వెళ్లిన వారంతా క్యాంపుల్లో తలదాచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగంగా పీకలు కోసినా మాట్లాడని జగన్.. నేడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చి మాట్లాడడం ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న వైఖరికి అద్దంపడుతోందని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ విభాగాలకు చెందిన ఫైళ్లు తెచ్చి కాలువ గట్లపై తగలబెడుతున్నారంటే మీరు చేసిన దురాగతాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. జగన్ తాను చేసిన అరాచకాలన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ఓర్వలేకపోతున్న జగన్.. అదెప్పుడిస్తారు? ఇదెప్పుడిస్తారు? అని ప్రశ్నిస్తున్నారని, సూపర్-6లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని దేవినేని స్పష్టం చేశారు.
Devineni Uma
Telugudesam
YS Jagan
Pinnelli Ramakrishna Reddy

More Telugu News