Rahul Gandhi: తాపీమేస్త్రి అవతారం ఎత్తిన రాహుల్ గాంధీ! వీడియో పంచుకున్న కాంగ్రెస్ పార్టీ
- ఢిల్లీలోని జీటీబీ నగర్ లో భవన నిర్మాణ కార్మికులను కలిసిన కాంగ్రెస్ అగ్ర నేత
- వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతోపాటు స్వయంగా పార, తాపీ పట్టుకొని రంగంలోకి దిగిన వైనం
- కార్మికులకు పూర్తి హక్కులు, గౌరవం కల్పించడమే తన జీవిత లక్ష్యమని వెల్లడి
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్ లో నీళ్లుపోసి కలపడంతోపాటు తాపీతో మెట్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది. కార్మికులు తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్నారని పేర్కొంది.
ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ నగర్ లో కొందరు భవన నిర్మాణ కార్మికులను రాహుల్ గురువారం సాయంత్రం కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసేపు వారితో కలిసి భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత కారులో తిరిగి వెళ్తూ ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘దేశంలో కూలిపనులు చేసే వారికి గౌరవం లభించడం లేదు. గతంలోనూ ఈ విషయం చెప్పా. ఇవాళ జీటీబీ నగర్ లో కూలీలను కలిసి మాట్లాడాక ఈ విషయం మరోసారి రుజువైంది. కూలీలు నిత్యం పనికోసం జీటీబీ నగర్ లో ఎదురుచూస్తుంటారు. రోజు కూలీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ద్రవ్యోల్బణం దెబ్బకు ఆ సొమ్ముతో సరిపుచ్చుకుంటున్నారు. ఒక్కోసారి ఆ కాస్త డబ్బు కూడా దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. కార్మికులు, కూలీలకు పూర్తి హక్కులు, గౌరవం తీసుకురావడమే నా జీవిత లక్ష్యం’ అని రాహుల్ ఆ వీడియో అన్నారు.
కార్మికులతో రాహుల్ పూర్తి సంభాషణగల పూర్తి వీడియోను త్వరలోనే విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.