Revanth Reddy: ముఖ్యమంత్రుల భేటీపై స్పందించిన సీపీఐ నారాయణ... రేవంత్ రెడ్డికి హెచ్చరిక!
- ఈ సమావేశం రేవంత్ రెడ్డికి కత్తిమీద సాములాంటిదన్న నారాయణ
- తేడా వస్తే రేవంత్ రెడ్డిని తెలంగాణ ద్రోహిగా ముద్ర వేస్తారని హెచ్చరిక
- సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచన
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ భేటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కత్తిమీద సాములాంటిదని అన్నారు. కొంచెం తేడా వచ్చినా రేవంత్ రెడ్డిని తెలంగాణ ద్రోహిగా ముద్ర వేస్తారని పేర్కొన్నారు. అయితే అందుకు ఆయన కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. రెచ్చగొట్టినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్య, భద్రాచలం, విభజన సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి ఏపీ భౌగోళికంగా విడిపోయిందన్నారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు తప్ప వారి మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవన్నారు. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పని చేసిందని... దానిని ఆంధ్రాకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. కాగా, రేపు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.