Samantha: సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్.. సమంత స్పందన ఇదిగో!

Samantha reacts to a doc comments

  • ప్రత్నామ్యాయ చికిత్సల గురించి ఇటీవల సమంత పోస్టు
  • సమంత చెప్పినట్టు చేస్తే ప్రాణాలకే ప్రమాదం అన్న ఓ వైద్యుడు
  • ఇన్ స్టాగ్రామ్ లో సుదీర్ఘ వివరణ ఇచ్చిన సమంత

ప్రముఖ నటి సమంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ బారినపడిన సమంత... సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ట్రీట్ మెంట్ గురించి పోస్టులు పెడుతుంటారు. ఇటీవల ఆమె నెబ్యులైజేషన్ గురించి పోస్టు చేశారు. వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నెబ్యులైజేషన్ లో ఈ మందులు కూడా వాడొచ్చు అంటూ సమంత పేర్కొన్నారు. 

అయితే, కొందరు డాక్టర్లు సమంత సూచన పట్ల మండిపడ్డారు. ఆమె చెప్పిన మందులు వాడితే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు. ఇలాంటి సలహాలు ఇస్తున్నందుకు సమంతను జైల్లో పెట్టాలని ఓ డాక్టర్ వ్యాఖ్యానించారు. సమంతకు వైద్య శాస్త్రం గురించి ఏం తెలుసని ఇలాంటి సలహాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమంత స్పందించారు. 

"గత కొన్నేళ్లుగా నేను అనేక రకాల ఔషధాలు వాడాను. నేను ప్రతిదీ ప్రయత్నించాను. అత్యున్నత విద్యార్హతలు ఉన్న నిపుణులు ఇచ్చిన సలహాలతోనే నేను ఆ మందులు వాడాను. నేను కూడా ఆ మందుల వాడకంపై సొంతంగా పరిశోధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. 

వీటిలో చాలా రకాల చికిత్సలు ఎంతో ఖరీదైనవి. అయితే, నేను ఈ చికిత్సలు చేయించుకోగల స్థితిలో ఉన్నందుకు అదృష్టవంతురాలిని అనుకుంటాను. ఆర్థిక భారం వల్ల ఇలాంటి చికిత్సలకు దూరమయ్యే వారి పరిస్థితి పట్ల బాధపడుతుంటాను. అయితే, దీర్ఘకాలంలో సంప్రదాయ వైద్య విధానాలు నాకు స్వస్థత అందించలేకపోయాయి. అయితే అవే వైద్య విధానాలు ఇతరులకు మెరుగైన ఫలితాలు అందించాయి. అందుకే నేను ప్రత్యామ్నాయ వైద్య విధానాల గురించి ఆలోచించాను.

ఆ తర్వాత నేను ప్రయత్నించి చూడగా... ప్రత్యామ్నాయ వైద్య విధానాలు నాకు అద్భుతమైన రీతిలో స్వస్థత చేకూర్చాయి. అంతేకాదు... వాటి ఖర్చు కూడా చాలా తక్కువ. నేను సంప్రదాయ వైద్య చికిత్సల కోసం ఖర్చు పెట్టిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 

ఇలాంటి చికిత్సను నాకు సూచించింది డీఆర్డీవోలో 25 ఏళ్ల పాటు సేవలు అందించిన ఓ వైద్య నిపుణుడు. ఆయన ఓ క్వాలిఫైడ్ డాక్టర్... పైగా ఎండీ కూడా. సంప్రదాయ వైద్యవిధానాల్లో ఎంతో పరిజ్ఞానం ఉన్న ఆయనే నాకు ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానం గురించి చెప్పారు. 

కానీ, ఒక వ్యక్తి మాత్రం నా గతం గురించి, నా ఉద్దేశాల గురించి తీవ్ర పదజాలంతో విమర్శించాడు. పైగా ఆ వ్యక్తి ఓ డాక్టర్ కూడా. నాకంటే అతడికే ఎక్కువ తెలిసి ఉండొచ్చు... కానీ అతడు ఉపయోగించిన తీవ్ర పదజాలమే బాగాలేదు. ముఖ్యంగా, నన్ను జైల్లో పెట్టాలన్న మాట నాకు నచ్చలేదు. 

నేను ఆ పోస్టు చేసింది ఒక సెలెబ్రిటీగా కాదు. వైద్య చికిత్స అవసరమైన ఓ వ్యక్తిలా ఆ పోస్టు చేశాను. ఆ పోస్టుపై నేను డబ్బు సంపాదించేది ఏమీ లేదు, ఇంకెవరికో ప్రచారం చేసేదీ లేదు. నా వరకు నాకు ఆ వైద్య విధానం ఓ ప్రత్నామ్నాయంలా ఉపయోగపడింది అని చెప్పాను. సంప్రదాయ వైద్య విధానాలతో విసిగిపోయి, ఇతర మార్గాల కోసం చూస్తున్నవారికి సలహా ఇచ్చాను. మందులు పనిచేయనంత మాత్రాన మనం వ్యాధితో పోరాడడం ఆపేస్తామా? నేనయితే ఆపను. 

ఇక, ఇందాక చెప్పిన డాక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఆ డాక్టర్ నాతో ఏమీ చర్చించకుండా...  నేను పోస్టులో ట్యాగ్ చేసిన డీఆర్డీవో వైద్య నిపుణుడిని ఎంతో మర్యాదగా చర్చలోకి లాగాడు. సరే... వాళ్లిద్దరూ గొప్ప డాక్టర్లు కాబట్టి, వాళ్ల చర్చ ద్వారా నేను కూడా ఏవైనా విషయాలు నేర్చుకోవచ్చేమోనని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు నేను పొందిన ట్రీట్ మెంట్ల ద్వారా నేను నేర్చుకున్న అంశాలను ఇతరులకు చెప్పడం ఎందుకంటే... ఆ విషయాలు వాళ్లకు కూడా ఏమైనా ఉపయోగపడతాయన్న కారణంతోనే" అని సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News