Rahul Dravid: బాబూ.. నన్నొదిలేయ్.. ప్రధాని సమక్షంలో ద్రావిడ్ కు కోహ్లీ వేడుకోలు!
- ప్రధాని మోదీతో టీమిండియా సమావేశం
- 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆట చేరికపై చర్చ, రాహుల్ ద్రావిడ్ సూచనలు
- ఒలింపిక్స్‌లో యువ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ కూడా ఆడతారన్న రాహుల్
- రాహుల్ వ్యాఖ్యలకు విరిసిన నవ్వుల పువ్వులు
జగజ్జేతలుగా నిలిచి యావత్ దేశం గర్వపడేలా చేసిన టీమిండియా సభ్యులు కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ, కోహ్లీ, తదితరులు ప్రధాని మోదీతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు టీ20 అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయాలను అడిగారు. ఈ సందర్భంగా జరిగిన ఆసక్తికర సంభాషణతో అక్కడ నవ్వులు విరిశాయి.
తొలుత రాహుల్ ద్రావిడ్ ఒలింపిక్స్‌కు సంబంధించి పలు సూచనలు చేశారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కున్న ప్రాముఖ్యత గురించి వివరించాడు. క్రికెట్ చరిత్రలో ఇదో గర్వకారణమైన క్షణమని వ్యాఖ్యానించారు. ఈసారి టీంలోని అనేక మంది 2028 ఒలింపిక్స్‌లో కూడా ఆడతారని అన్నారు. రోహిత్, కోహ్లీ లాంటి ‘యువ క్రీడాకారులు’ కూడా ఇందులో ఉంటారని ప్రధాని ముందు వారిద్దరినీ ఆటపట్టించారు. వాళ్ల రిటైర్మెంట్ను పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో, ప్రధాని సహా అక్కడున్న వారందరూ భళ్లున నవ్వారు. ఈ క్రమంలో కోహ్లీ.. 'నన్ను వదిలేయ్ బాబూ' అన్నట్టు రాహుల్ వైపు చూస్తూ చేతులు జోడించడం అభిమానులను బాగా ఆకట్టుకుంది.
ఇక మోదీతో సమావేశం అనంతరం, టీమిండియా ముంబైకి చేరుకుంది. అక్కడ వారికి అబ్బుర పరిచే రీతిలో స్వాగతం లభించింది. మెరైన్ డ్రైవ్‌లో ఓపెన్ బస్‌లో టీమిండియాతో కలిసి వేల సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. జన సంద్రాన్ని తలపించారు. ఇక వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీసీఐ టీమిండియా ప్లేయర్లను సత్కరించి రూ.125 కోట్ల నగదు బహుమానం పంపిణీ చేసింది.