Shubman Gill: నేడే భారత్-జింబాబ్వే మధ్య తొలి టీ20.. ఓపెనర్‌గా సన్‌రైజర్స్ ఆటగాడు.. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ప్రకటన
- యువ బ్యాటర్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నట్టు ప్రకటించిన గిల్
- మూడవ నంబర్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ వస్తాడని వెల్లడి
- హరారే వేదికగా నేడు భారత్-జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్
- సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం
టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడిన తర్వాత భారత్ తొలి టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా నేడు (శనివారం) భారత్-జింబాబ్వే తలపడబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. అయితే మ్యాచ్‌కు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు అభిషేక్ శర్మ కెరీర్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడని ప్రకటించాడు. అభిషేక్ శర్మ, తాను ఓపెనర్లుగా రాబోతున్నట్టు నిర్ధారించాడు. మొదటి రెండు మ్యాచ్‌లకు యశస్వి జైస్వాల్ అందుబాటులో లేకపోవడంతో అభిషేక్‌కు ఓపెనర్ అవకాశం దక్కిందని వివరించాడు. ఐపీఎల్ 2024లో అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఏకంగా 204.21 స్ట్రైక్ రేట్‌తో 500కి పైగా పరుగులు బాదాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలకమైన 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని గిల్ చెప్పాడు.
గతంలో టీ20లలో తాను ఓపెనర్‌గా వచ్చానని, అందుకే మరోసారి ఓపెనర్‌గా రావాలనుకుంటున్నట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ చెప్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ, విరాట్లతో తమను పోల్చలేమని, అయితే ప్రతి క్రికెటర్ కు తన సొంత లక్ష్యం ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒత్తిడి, అంచనాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయని గిల్ పేర్కొన్నాడు. ‘‘విరాట్ అన్న, రోహిత్ అన్న సాధించిన దానిని చేరుకోవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ప్రతి ఆటగాడికి సొంత లక్ష్యం ఉంటుంది. గమ్యం చేరుకోవాలనే అనుకుంటాడు. అయితే ఇతర వ్యక్తులు సాధించింది సాధించాలనుకుంటే ఒత్తిడి మరింత ఎక్కువ ఉంటుంది’’ అని వ్యాఖ్యానించాడు.
అంచనా జట్లు..
భారత అంచనా జట్టు: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్.
జింబాబ్వే అంచనా జట్టు: బ్రియాన్ బెన్నెట్, తాడివానాషే మారుమణి, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, అంటుమ్ నఖ్వీ, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెస్లీ మాధేవెరే, ల్యూక్ జోంగ్వే, ఫరాజ్ అక్రమ్, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ.