GHMC Council Meeting: రసాభాసగా జీహెచ్ఎంసీ సమావేశం.. సిగ్గుండాలంటూ బీఆర్ఎస్ పై మేయర్ తీవ్ర ఆగ్రహం

Heat arguments in GHMC Council meeting
  • ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మేయర్ విజయలక్ష్మి
  • మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళన
  • పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్సే అని మేయర్ మండిపాటు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని, మేయర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో, సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే అని మేయర్ మండిపడ్డారు. ఈ అంశంపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ కు సిగ్గుండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు ఆపకపోతే... సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో... సమావేశాన్ని ఆమె 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. 

మరోవైపు విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా బీఆర్ఎస్ తరపునే గెలుపొందారు. ఇటీవలే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, వీరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమయింది. ఈ క్రమంలోనే వీరి రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.
GHMC Council Meeting
Vijayalakshmi
Mayor

More Telugu News