UK Elections: బ్రిటన్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థికి ఎంతమంది ఓటేశారంటే..!
- కృత్రిమ మేధ అభ్యర్థిని నిలబెట్టిన బ్రిటన్ వ్యాపారి
- ఎన్నికల్లో నిలబడ్డ తొలి వర్చువల్ అభ్యర్థిగా రికార్డు
- తప్పని ఓటమి.. నియోజకవర్గంలోనే లాస్ట్ ప్లేస్
బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ కృత్రిమ మేధ (ఏఐ) అభ్యర్థిగా పోటీ పడ్డ విషయం తెలిసిందే. ఎన్నికల్లో నిలబడ్డ తొలి ఏఐ అభ్యర్థిగా రికార్డు సృష్టించిన ఈ క్యాండిడేట్ పేరు ‘ఏఐ స్టీవ్’. బ్రిటన్ కు చెందిన వ్యాపారవేత్త స్టీవ్ కాట్ ఈ క్యాండిడేట్ ను పోటీలో నిలబెట్టారు. తన పేరు, ఫొటోతో ఏఐ అవతార్ సృష్టించి, నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఏఐ స్టీవ్ పాల్గొంది. అయితే, ఏఐ స్టీవ్ ను బ్రిటన్ పౌరులు ఆదరించలేదు. కేవలం 179 మంది మాత్రమే ఓటేశారు. దీంతో ఏఐ స్టీవ్ పోటీ చేసిన నియోజకవర్గంలో చివరి అభ్యర్థిగా నిలిచింది. దీనిపై వ్యాపారవేత్త స్టీవ్ కాట్ స్పందిస్తూ.. తన తరఫున పోటీకి నిలబెట్టిన ఏఐ అవతార్ కు 179 ఓట్లు దక్కినట్లు తెలిపారు.
వర్చువల్ అసిస్టెంట్లుగా, ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్ ఏజెంట్లుగా, న్యూస్ యాంకర్లుగా, వర్చువల్ టీచర్లుగా.. ఇలా ప్రతీ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ (ఏఐ) దూసుకుపోతోందని స్టీవ్ కాట్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే ఏఐని ఎన్నికల్లో నిలబెట్టాలనే ఆలోచన వచ్చిందన్నారు. ఆ వెంటనే తన ఫొటోతో ఏఐ అవతార్ ను సృష్టించి, ఎన్నికల్లో పోటీ చేయించానని వివరించారు.