Raghunandan Rao: తూ..తూ మంత్రంగా కాదు... ఇదే చివరి భేటీ అన్నట్లుగా ఉండాలి: చంద్రబాబు-రేవంత్ భేటీపై రఘునందన్ రావు సూచన
- పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేలా సమావేశం ఉండాలని వ్యాఖ్య
- స్నేహపూర్వక వాతావరణంలో భేటీ సఫలం కావాలన్న రఘునందన్ రావు
- ఈ సమావేశం ఫలితాలు ఇరురాష్ట్రాల ప్రజలకు ఆనందం పంచేలా ఉండాలని ఆకాంక్ష
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని... కాబట్టి నేటి సమావేశంలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై తూతూ మంత్రంగా కాకుండా, ఇదే చివరి సమావేశం అన్నట్లుగా జరగాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజాభవన్ వేదికగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారని... ఈ సమావేశం ఫలితాలు రెండు రాష్ట్రాల ప్రజలకు ఆనందం పంచేలా ఉండాలని ఆకాంక్షించారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డిని గురుశిష్యులు అంటారా? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటారా?... ఏదైనా పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేలా వారి సమావేశం ఉండాలన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ఈ భేటీ సఫలం కావాలన్నారు. వీరిద్దరూ గతంలో చాలాకాలం ఒకే పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు.
ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చేలా చర్చలు ఫలప్రదం కావాలన్నారు. భేటీలో ముఖ్యంగా న్యాయపరమైన ఆస్తుల విషయంలో సుదీర్ఘ చర్చలు జరిపి వాటిని పరిష్కరించుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులూ చొరవ చూపాలని సూచించారు.