Jagan: మరోసారి చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన జగన్
- దాడుల సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారన్న జగన్
- రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపాటు
- హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడుల సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు దాడులను వెంటనే ఆపకపోతే... రానున్న రోజుల్లో టీడీపీ వాళ్లకు కూడా అదే గతి పడుతుందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి, కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి ఓటు వేశారనే ఉద్దేశంతో 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారని జగన్ అన్నారు. ఇలాంటి దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదని... రాష్ట్రంలో చంద్రబాబు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శిశుపాలుడి పాపాల మాదిరి చంద్రబాబు పాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయని... అధికారం మారిన రోజున ఆ పాపాలు తనకు కూడా చుట్టుకుంటాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని చెప్పారు.
మోసపూరిత వాగ్దానాల వల్లే చంద్రబాబు గెలిచారని జగన్ విమర్శించారు. రైతు భరోసా, నిరుద్యోగభృతి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులపై దాడులు చేయడం కాకుండా... ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని అన్నారు. నాయకులుగా ఉన్న మనం... దాడుల సంస్కృతిని ప్రోత్సహించకూడదని చెప్పారు.
మూడు రోజుల పర్యటనకు గాను జగన్ కడపకు వెళ్లారు. కడప ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు.