Telugu States: హైదరాబాదులో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి సర్వం సిద్దం
- రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు
- ఇప్పటికీ అపరిష్కృతంగా అనేక అంశాలు
- నేడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య కీలక సమావేశం
- హైదరాబాదు ప్రజా భవన్ లో ఈ సాయంత్రం 6 గంటలకు సమావేశం
విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నేడు హైదరాబాదులో సమావేశం కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రజా భవన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం అజెండా కూడా ఖరారైంది. ఏపీ, తెలంగాణ సీఎంలు పది అంశాల అజెండాతో చర్చకు రానున్నారు.
విభజన చట్టం షెడ్యూల్ 9, 10 కిందికి వచ్చే సంస్థల ఆస్తులపై చర్చించనున్నారు. షీలా బీడే కమిటీ సిఫారసులను ఇద్దరు ముఖ్యమంత్రులు పర్యవేక్షించనున్నారు. విద్యుత్ బకాయిలు, ఏపీఎఫ్ సీ అంశాలపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉభయ రాష్ట్రాల మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్షించే అవకాశాలున్నాయి.
ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చించనున్నారు. హైదరాబాదులోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నట్టు సమాచారం.
కాగా, విభజన చట్టం 9, 10 కిందికి వచ్చే సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్టు గుర్తించారు. విభజన పూర్తి కాని ఈ సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ.8 వేల కోట్ల నగదు ఉంది. సంస్థల విభజన జరగకపోవడంతో ఈ నిధులను రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోలేదు. గత పదేళ్లుగా బ్యాంకుల్లో ఉన్న ఈ వేల కోట్ల నగదుపైనా నేటి సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు.
9వ షెడ్యూల్ కిందికి వచ్చే సంస్థల్లో ఏపీ జెన్ కో కూడా ఉంది. దీని విలువ రూ.2,448 కోట్లుగా నిర్ధారించారు. 10వ షెడ్యూల్ కిందికి వచ్చే కొన్ని సంస్థలకు రూ.2,994 కోట్ల నిధులు ఉండగా, ఈ నిధుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు రూ.1,559 కోట్లను పంచుకున్నాయి. ఇంకా రూ.1,435 కోట్ల పంపకంపై పంచాయితీ నడుస్తోంది. ఈ అంశం కూడా నేటి సమావేశంలో చర్చించనున్నారు. చట్టంలో లేని సంస్థల విభజనపైనా చంద్రబాబు, రేవంత్ ఇవాళ ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.