Atchannaidu: బొత్స భలే జోకులు వేస్తున్నారు: అచ్చెన్నాయుడు
- సీఎంల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేయాలన్న బొత్స
- పారదర్శకత గురించి మీరు మాట్లాడితే జనాలు నవ్వుకుంటారన్న అచ్చెన్న
- రాష్ట్రం ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉందని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వీరి భేటీ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, వీరి సమావేశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలవడం కోసం సీఎంల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ఈ ట్వీట్ కు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు.
బొత్సగారు భలే జోకులు వేస్తున్నారంటూ అచ్చెన్న ఎద్దేవా చేశారు. పారదర్శకత గురించి మీరు, జగన్ మాట్లాడితే జనాలు నవ్విపోతారు... వద్దులెండి అని అన్నారు. పారదర్శకతకు పాతరేసిందే మీరు, మీ పార్టీ అని విమర్శించారు. ప్రెస్ మీట్లు కూడా లైవ్ ఇవ్వకుండా... ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు, పారదర్శకత వంటి పెద్దపెద్ద పదాలు మీరు వాడొద్దని చెప్పారు. ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉందని... మీరు ఆందోళన చెందొద్దని చెప్పారు. సమావేశమయ్యాక అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.