Mallu Bhatti Vikramarka: ముఖ్యమంత్రుల సమావేశంలో మేం తీసుకున్న నిర్ణయాలు ఇవే: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka reveals what decisions has taken in Chief Ministers meeting today
  • హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
  • హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
  • సమావేశం అనంతరం ఉభయ రాష్ట్రాల మంత్రుల ప్రెస్ మీట్
పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారం కోసం నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాదులో సమావేశమయ్యారు. ప్రజాభవన్ లో ఒక గంట 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సీఎంల సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ, ఏపీ మంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. 

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నుంచి నేను, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ నుంచి సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్ గారు అందరం ఈ సమావేశానికి హాజరయ్యామని వెల్లడించారు. 

"ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి, ఇరు రాష్ట్రాలకు చెందిన అపరిష్కృత అంశాలపై త్వరితగతిన చర్చించుకుని ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో ఈ సమావేశాన్ని నేడు ఏర్పాటు చేయడం జరిగింది. 

విభజన చట్టంలోని పెండింగ్ అంశాలకు ఈ సమావేశంలోనే పరిష్కారం లభిస్తుందని మేం ఆశించలేదు. కాకపోతే, వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి విధానపరమైన వ్యవస్థలు ఏర్పాటుకు రెండు రాష్ట్రాల సీఎంలు సహా ప్రతినిధుల బృందాలు కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాం. 

ముందుగా, రెండు రాష్ట్రాల ఉన్నతస్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల సీఎస్ స్థాయి అధికారులు, రాష్ట్రానికి ముగ్గురు ఉన్నతాధికారుల చొప్పున సభ్యులు ఉంటారు. ఈ కమిటీ మరో రెండు వారాల్లో సమావేశమై వారి స్థాయిలో పరిష్కారం లభించే అంశాలపై చర్చిస్తుంది. 

ఈ ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కాని అంశాలు ఏవైనా ఉంటే... రెండు రాష్ట్రాల మంత్రులతో కూడిన ఒక కమిటీ వేయాలని నిర్ణయించాం. అపరిష్కృత అంశాలపై ఈ మంత్రుల కమిటీ సమావేశమై చర్చిస్తుంది. మంత్రుల కమిటీలో పరిష్కారమైన అంశాలను ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించడం జరుగుతుంది. 

ఒకవేళ మంత్రుల కమిటీ ద్వారా కూడా ఏవైనా అంశాలకు పరిష్కారం లభించకపోతే, మళ్లీ ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం మూడు దశల్లో సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ సిద్ధం చేశాం. ఈనాటి సమావేశంలో ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం ఇదే. 

ఇక, ఇదే సమావేశంలో మరో అతి ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్ చేపడుతోంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. సైబర్ నేరాలతోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

అందుకే... యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడి కార్యాచరణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఒక సమన్వయ కమిటీ ద్వారా సమర్థవంతంగా పనిచేయగలిగితే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. ఈ మేరకు నేటి సమావేశంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇవీ ఈనాటి సమావేశానికి చెందిన ముఖ్యమైన అంశాలు" అని భట్టి విక్రమార్క వివరించారు.
Mallu Bhatti Vikramarka
Chief Ministers Meeting
Chandrababu
Revanth Reddy
Telangana
Andhra Pradesh

More Telugu News