Golkonda Bonalu: బోనమెత్తిన గోల్కొండ.. డీజేలకు అనుమతి నిల్

Golkonda bonalu started today

  • హైదరాబాద్‌లో బోనాలకు నాంది
  • ఉదయం 5.30 గంటల నుంచే పోటెత్తిన భక్తులు
  • పచ్చి కుండలతో వచ్చి బోనం సమర్పించిన కులవృత్తుల సంఘం నాయకుడు 
  • 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు
  • అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

గోల్కొండ బోనాలతో హైదరాబాద్‌లో బోనాల పండుగకు నాందిపడింది. గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు సమర్పించే తొలి బోనానికి దాదాపు లక్షమంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు.

తెల్లవారుజామున 5.30 గంటలకు రెండు పచ్చికుండలతో వచ్చిన కులవృత్తుల నాయకుడు శంకర్ అమ్మవారికి బోనం సమర్పించారు. గోల్కొండలోని ఫతేదర్వాజాలో ఉన్న పూజారి సర్వేశ్‌కుమార్ ఇంట్లో నుంచి జగదాంబికా అమ్మవారి ఉత్సవమూర్తులను మధ్యాహ్నం ఊరేగింపుగా తీసుకెళ్తారు. గోల్కొండ ఆలయ అమ్మవారి కులవృత్తుల సంఘం నాయకుడు బొమ్మల సాయిబాబాచారి నివాసం నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులను వైభవంగా ఊరేగిస్తారు. వందమంది పోతురాజులతో ఐరావతంపై ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. అలాగే, సాయిబాబాచారి నివాసం వద్ద 1000 మందికి అన్నదానం నిర్వహించనున్నారు. 

బోనాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో 600 మందితో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. వేడుకల్లో డీజేకు అనుమతి లేదని, కావాలంటే సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. అలాగే, 150 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. లంగర్‌హౌస్ చౌరస్తాలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తోపాటు అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

  • Loading...

More Telugu News