Guwahati: గల్లంతైన కొడుకు కోసం నాలుగు రోజులుగా డ్రైనేజీలన్నీ గాలిస్తున్న తండ్రి

Search For Boy Continues In Drains Desperate Father Vows Not To Rest

  • బిడ్డ లేకుండా ఇంటికెలా వెళ్లాలంటూ తండ్రి ఆవేదన
  • జాగిలాల సాయంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
  • తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పిన సీఎం హిమంత బిశ్వ శర్మ

భోరున కురుస్తున్న వర్షంలోనే కొడుకును తీసుకుని స్కూటర్ పై ఇంటికి బయలుదేరాడా తండ్రి.. వెనక కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడు స్లిప్ అయి రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్న డ్రైనేజీలో కొట్టుకుపోయాడు. కొడుకును కాపాడుకోవడానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నం విఫలమైంది. కనీసం కొడుకు శరీరాన్ని అయినా ఇంటికి తీసుకెళ్లాలని ఆ తండ్రి నాలుగు రోజులుగా డ్రైనేజీలన్నీ వెతుకుతూనే ఉన్నాడు. కన్నీరు పెట్టించే ఈ విషాద సంఘటన అస్సాంలోని గువహటిలో గత గురువారం చోటుచేసుకుంది.

గువహటికి చెందిన హీరాలాల్ గురువారం సాయంత్రం కొడుకు అభినాశ్ తో కలిసి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైనేజీలో పడ్డ కొడుకును కాపాడేందుకు వెంటనే హీరాలాల్ కూడా అందులో దూకాడు. ఎంత గాలించినా కొడుకు మాత్రం దొరకలేదు. కొడుకు లేకుండా ఇంటికి వెళ్లలేనంటూ గురువారం నుంచి హీరాలాల్ రాత్రీపగలు మురుగు కాలువలన్నీ వెతుకుతూనే ఉన్నాడు. రాత్రిపూట ఓ షాపు వరండాలో దోమ తెర మధ్య కాసేపు కునుకుతీస్తున్నాడు. కొడుకు డ్రైనేజీలో కొట్టుకుపోతున్న దృశ్యాలు గుర్తుకొచ్చి ఉలిక్కిపడి లేచి మళ్లీ కాలువలో గాలిస్తున్నాడు.

మూడు రోజుల వెతుకులాట తర్వాత అభినాశ్ చెప్పులు దొరికాయని, వాటిని పోలీసులకు అందించానని చెప్పాడు. హీరాలాల్ తో పాటే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా డ్రైనేజీలన్నీ జల్లెడ పడుతున్నాయి. జాగిలాల సాయం తీసుకుని మురుగు కాలువల్లో వెతుకుతున్నాయి. విషయం తెలిసి సీఎం హిమంత బిశ్వ శర్మ స్వయంగా అక్కడికి వచ్చారు. ప్రమాదం గురించి హీరాలాల్ ను అడిగి తెలుసుకున్నారు. కన్నీరుమున్నీరవుతున్న ఆ దంపతులను ఓదార్చి, గాలింపు చర్యలను తీవ్రం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News