Chandrababu: రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు: చంద్రబాబు

Chandrababu Speech at NTR Bhavan

  • రెండు ప్రాంతాల అభివృద్ధే టీడీపీ లక్ష్యం
  • యుగపురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై టీడీపీని స్థాపించారు
  • అధికారం పోయి 20 ఏళ్లు.. అయినా మీ ఉత్సాహం తగ్గలేదు
  • తెలుగుజాతి ఉన్నంత వరకూ పసుపు జెండా ఎగురుతుందన్న ఏపీ సీఎం

తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకపోగా, రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని చంద్రబాబు మరోసారి ఉద్ఘాటించారు.

ఈమేరకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు.. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీని యుగపురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై, ఇక్కడే ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభించారని గుర్తుచేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేందుకు టీడీపీ పుట్టుకొచ్చిందని, ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు చెప్పారు. తెలుగుజాతికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.. తెలుగువాళ్లను మదరాసీ అని పిలుస్తుంటే కాదు తెలుగుజాతి అనేది ఒకటుందని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. కరణం, మునసబు, పటేల్ పట్వారీ వ్యవస్థతో తెలంగాణ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను ఎన్టీఆర్ తొలగించారని గుర్తుచేశారు.

ఆ వ్యవస్థలను ఎన్టీఆర్ రద్దు చేయడంతో మాకు స్వాతంత్ర్యం వచ్చిందని ఇక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని, ఏ ప్రాంతంవైపు మొగ్గుచూపబోనని తాను చెప్పానన్నారు. రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. తెలుగుజాతి ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటా, కలిసిమెలిసి ఉండాలనే నా చివరి రక్తపుబొట్టు వరకు ఆలోచిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News