Captain Anshuman Singh: నా భర్త హీరో.. పెళ్లయిన 5 నెలలకే భర్తను కోల్పోయిన అమర జవాను భార్య భావోద్వేగం

Gallantry awardee Army officer wife shares painful story of love husband death at award ceremony

  • గతేడాది జులై 19న సియాచిన్ లోని ఆర్మీ క్యాంపులో అగ్నిప్రమాదం
  • గుడారాల్లో ఉన్న సైనికులను కాపాడే క్రమంలో అమరుడైన కెప్టెన్ డాక్టర్ అన్షుమన్ సింగ్
  • శాంతిసమయంలో ఇచ్చే దేశ రెండో అత్యున్నత సాహస పురస్కారం కీర్తిచక్రకు ఎంపిక
  • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డును శుక్రవారం అందుకున్న భార్య స్మృతీ సింగ్, తల్లి మంజూసింగ్
  • వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన దూరదర్శన్

ఆ ప్రాంగణంలో ఉన్న వారంతా భావోద్వేగానికి లోనవుతున్నారు.. అందరి ముఖాల్లోనూ దు:ఖం పొంగుకొస్తోంది.. ఓవైపు తమ వారిని తలుచుకుని బాధపడుతూనే మరోవైపు గర్వపడుతున్నారు.. ఇదీ రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం కేంద్ర, రాష్ట్ర సాయుధ దళాలకు చెందిన సిబ్బందికి సాహస పురస్కారాల ప్రదానంలో కనిపించిన దృశ్యం. ఉగ్రవాదులు, మావోయిస్టులతో వీరోచితంగా పోరాడిన సైనికులు, పోలీసులతోపాటు ఆ క్రమంలో అమరులైన జవాన్లు, పోలీసుల సేవలను గుర్తిస్తూ కేంద్రం గ్యాలంట్రీ అవార్డులతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొత్తం 36 సాహస పురస్కారాలను ప్రదానం చేశారు. 

అవార్డులు అందుకున్న వారిలో స్మృతీసింగ్ ఒకరు. పెళ్లయిన ఐదు నెలలకే దేశ సేవలో ఉన్న భర్త కెప్టెన్ డాక్టర్ అన్షుమన్ సింగ్ ను ఆమె కోల్పోయారు. కశ్మీర్ లోని సియాచిన్ లో సహచర సైనికులను అగ్నిప్రమాదం బారి నుంచి కాపాడే క్రమంలో అసువులుబాసిన అన్షుమన్ సింగ్ కు మరణానంతరం కేంద్రం శాంతిసమయంలో ఇచ్చే దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం కీర్తి చక్రకు ఎంపిక చేసింది. భర్త తరఫున ఆయన సతీమణి స్మృతీసింగ్ తన అత్తగారు మంజూసింగ్ తో కలిసి వచ్చి భావోద్వేగం మధ్య రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ద్రౌపదీ ముర్ము ఆమెను భుజం తట్టి ఓదార్చారు.

అనంతరం సైనికుల విజయగాథల వీడియోలను దూరదర్శన్ (డీడీ నేషనల్) తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులోని ఓ వీడియోలో స్మృతీ సింగ్ తన భర్త విజయగాథను, భర్తతో తన పరిచయం, అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను ఎవరూ పట్టించుకోని, గుర్తించలేని మామూలు మరణం పొందను. ఛాతీపై ఇత్తడి అక్షరాలు లిఖించుకొనే మరణిస్తాను’ అని తన భర్త చెప్పేవారని చెప్పారు.

‘కాలేజీలో తొలిసారి కలిసినప్పుడే మేం ప్రేమలో పడిపోయాం. ఆ తర్వాత నెలకు ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో ఆయనకు సీటు వచ్చింది. అసలు మేం ఇంజనీరింగ్ కాలేజీలో కలుసుకున్నాం. కానీ ఆయన మాత్రం మెడికల్ సీటుకు ఎంపికయ్యారు. ఎంతో తెలివైన వారు. అనంతరం ఎనిమిదేళ్లపాటు ఒకరికొకరం దూరంగా ఉన్నా మా ప్రేమ కొనసాగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఒక్కటయ్యాం. కానీ దురదృష్టవశాత్తూ పెళ్లయిన రెండు నెలలకే ఆయనకు కశ్మీర్ లోని సియాచిన్ కు బదిలీ అయింది. 26 పంజాబ్ రెజిమెంట్ లో మెడికల్ ఆఫీసర్ గా పోస్టింగ్ వచ్చింది. గతేడాది జులై  18న ఇరువురం ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. వచ్చే 50 ఏళ్లపాటు ఎలా జీవించాలో కలలుకన్నాం. కానీ 19న ఉదయం ఆయన లేరన్న దుర్వార్త వచ్చింది. మొదట నమ్మలేకపోయా. ఇప్పుడు నా చేతిలో కీర్తి చక్ర పురస్కారం ఉన్నందున ఇది నిజమే అనిపిస్తోంది. కానీ నా భర్త హీరో. ఇతర సైనిక కుటుంబాలను కాపాడేందుకు ఆయన ప్రాణాన్ని అర్పించారు’ అంటూ స్మృతీసింగ్ భావోద్వేగానికి గురవుతూ చెప్పారు.

గతేడాది జులై 19న తెల్లవారుజామున మందుగుండు సామగ్రి నిల్వ ఉంచిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఫైబర్ గ్లాస్ గుడారానికి అంటుకోవడంతో అందులో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు కెప్టెన్ డాక్టర్ అన్షుమన్ సింగ్ లోపలకు పరుగుతీశారు. నలుగురైదుగురిని కాపాడారు. కానీ పక్కనున్న ల్యాబ్ గదిలోకి మంటలు వ్యాపించడంతో మరోసారి లోపలకు వెళ్లారు. కానీ ఆ మంటల్లోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

గతేడాది జులై 22న యూపీలోని భాగల్ పూర్ లో పూర్తి అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

  • Loading...

More Telugu News