Rahul Dravid: 'ద్రావిడ్' కు భారతరత్న ఇవ్వాలన్న భారత క్రికెట్ దిగ్గజం
- టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడం వెనుక రాహుల్ ద్రావిడ్ కృషి
- భారతరత్నకు ద్రావిడ్ అన్ని విధాలా అర్హుడన్న గవాస్కర్
- ద్రావిడ్ కు భారతరత్న... ఈ మాట వింటుంటేనే అద్భుతంగా ఉందని వెల్లడి
టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరు కూడా మార్మోగిపోతోంది. భారత క్రికెట్లో ఆణిముత్యం అనదగ్గ వ్యక్తి రాహుల్ ద్రావిడ్. 'ది వాల్' అనే బిరుదుకు న్యాయం చేస్తూ, ఎన్నోసార్లు వికెట్ల పతనానికి అడ్డుగోడలా నిలిచిన ద్రావిడ్... ఆటగాడిగా అనేక ఘనతలు సాధించాడు. వాటన్నింటినీ మించిపోయేలా కోచ్ గా వరల్డ్ కప్ ను సాధించి తన కెరీర్ ను చిరస్మరణీయం చేసుకున్నాడు.
కాగా, ద్రావిడ్ కు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంటున్నారు. భారతరత్నకు ద్రావిడ్ అన్ని విధాలా అర్హుడని గవాస్కర్ స్పష్టం చేశారు. ద్రావిడ్ కు భారతరత్న ఇవ్వడం సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
"కెప్టెన్ గానూ, ఆటగాడిగానూ ద్రావిడ్ ఎనలేని సేవలు అందించాడు... నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా యువ ప్రతిభావంతులను ఎంతోమందిని తెరపైకి తెచ్చాడు... టీమిండియా కోచ్ గా అద్భుతమైన ఫలితాలు అందించాడు... కెరీర్ లోఎన్నడూ స్వార్థం చూపించలేదు. ద్రావిడ్ అన్ని వర్గాలను అలరించిన వ్యక్తి. రాహుల్ ద్రావిడ్ కు భారతరత్న... ఈ మాట వింటేనే అద్భుతంగా అనిపిస్తోంది. ద్రావిడ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుదాం... మీరు కూడా నాతో జత కలుస్తారని అనుకుంటున్నా" అంటూ గవాస్కర్ పేర్కొన్నారు.