Mumbai: 6 గంటల్లో ఏకంగా 30 సెంటీమీటర్ల వర్షం.. నీట మునిగిన ముంబై

Heavy downpour leaves city waterlogged local train services hit
  • పట్టాలపై చేరిన వరదనీరు.. చాలా ప్రాంతాల్లో లోకల్ రైళ్ల రద్దు
  • సిటీ బస్సుల దారిమళ్లింపు.. స్తంభించిన జనజీవనం
  • స్కూళ్లు, కాలేజీలకు ఉదయం పూట సెలవు ప్రకటించిన బీఎంసీ
  • మరో 3 రోజులపాటు ముంబై సహా మహారాష్ట్రకు భారీ వర్ష సూచన
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ర్ట పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజధాని ముంబైతోపాటు పక్కనే ఉండే థానే, పాల్ఘర్, రాయ్ గడ్ ప్రాంతాలు సైతం నీటమునిగాయి.

ముఖ్యంగా ముంబైలో రోడ్లపై ఎటుచూసినా వరదనీరు ప్రవహిస్తోంది. జనజీవనం స్తంభించింది. ముంబైకర్ల జీవనాడిగా పేర్కొనే లోకల్ రైళ్లు సైతం చాలా ప్రాంతాల్లో రద్దయ్యాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ లు సైతం నీట మునిగాయి.

ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా 30 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, కుర్లా–విక్రోలీ, బంధూప్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. అలాగే ముంబై డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లను వరద ముంచెత్తినందుకు 12110 (ఎంఎంఆర్–సీఎస్ ఎంటీ), 11010 (పుణే–సీఎస్ ఎంటీ), 12124 (పూణే–సీఎస్ ఎంటీ డెక్కన్), 11007 (పూణే–సీఎస్ ఎంటీ డెక్కన్), 12127 (సీఎస్ ఎంటీ– పూణే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్) రైళ్లను రద్దు చేసినట్లు చెప్పింది. 

మరోవైపు 'బెస్ట్' బస్ ట్రాన్స్ పోర్ట్ సైతం భారీ వర్షాల కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బస్సులను దారిమళ్లించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక జాబితాను సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ఇక థానే, వసాయ్ (పాల్ఘర్), మహద్ (రాయ్ గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సంగ్లీ, సటారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ లలో వరద సహాయ చర్యలను చేపట్టేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను ప్రభుత్వం మోహరించింది. ముంబైలోని అంధేరీలో మూడు బృందాలతోపాటు నాగ్ పూర్ లో అదనపు బృందాలను సిద్ధంగా ఉంచింది.

ఒక్క రోజు వర్షానికే ముంబై అతలాకుతలం అవగా వచ్చే మూడు రోజులపాటు ముంబైతోపాటు మహారాష్ర్టలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో సోమవారం అంతా ఓ మాదిరి నుంచి భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది.

భారీ వర్షాల నేపథ్యంలో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఉదయం సెషన్ తరగతులకు సెలవు ప్రకటించింది. పరిస్థితిబట్టి మధ్యాహ్నం సెషన్ తరగతులకు సెలవుపై నిర్ణయం తీసుకోనుంది.
Mumbai
Heavy Rains
BMC
Trains disrupted
Best Buses diverted
Schools
Colleges
Shut
Flood

More Telugu News