Joe Biden: ట్రాన్స్‌లో బైడెన్.. నిల్చోమని పాస్టర్ చెబుతున్నా వినిపించుకోని అమెరికా అధ్యక్షుడు.. వీడియో ఇదిగో!
- ఇటీవల వరుసగా అభాసుపాలవుతున్న బైడెన్
- ఫిలడెల్ఫియా చర్చ్‌లో ఇబ్బందికర ఘటన
- అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలని డిమాండ్లు
- నాన్సెన్స్ అని కొట్టిపారేసిన బైడెన్
అమెరికాను మరోమారు ఏలేద్దామని రెండోసారి బరిలో నిలిచిన అధ్యక్షుడు బైడెన్‌కు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సభల్లోనూ, డిబేట్లలోనూ అభాసుపాలవుతున్న బైడెన్ బరి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
తాజాగా, ఫిలడెల్ఫియాలో జరిగిన కార్యక్రమంలో బైడెన్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. చర్చ్ పాస్టర్ రావడానికి ముందే కుర్చీలో ఆసీనుడైన బైడెన్ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. లేచి నిల్చుని సభికులకు అభివాదం చెప్పాలని పాస్టర్ చెబుతున్నా బైడెన్ అలాగే నిల్చుని కాలుపై చేతితో దరువేసుకుంటూ కూర్చున్నారు.
81 ఏళ్ల బైడెన్ ఇటీవల వరుసగా విమర్శల పాలవుతున్నారు. జూన్ 27న 78 ఏళ్ల ట్రంప్‌తో జరిగిన డిబేట్ తర్వాత బైడెన్ అభ్యర్థిత్వంపై ప్రశ్నలు మొదలయ్యాయి. అధ్యక్షుడిగా ఎన్నికైతే మరో నాలుగేళ్లు ఆయన బాధ్యతలు నిర్వర్తించగలరా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేశారు. అయితే, బైడెన్ మాత్రం ఈ విమర్శలను ‘నాన్సెన్స్’ అంటూ కొట్టిపడేశారు. తాను అధ్యక్ష బరిలో ఉంటానని స్పష్టం చేశారు.