North Korea: వినాశనానికి వెల్ కం చెప్పడమే..! సౌత్ కొరియా సైనిక విన్యాసాలపై కిమ్ సోదరి వార్నింగ్

Kim Jong Un Sister Hits Out At South Korea Military Drills
  • కనీవినీ ఎరగని విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక
  • సరిహద్దుల్లో విన్యాసాలు జరపడంపై దక్షిణ కొరియాపై మండిపాటు
  • తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనన్న కిమ్ యో జాంగ్
నార్త్, సౌత్ కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలు చేస్తూ తమ తమ సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తున్నాయి. పొరుగు దేశాన్ని భయాందోళనలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ కొరియా లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది. నార్త్ కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవులలో ఈ డ్రిల్స్ చేసింది. దీనిపై నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్న సోదరి కిమ్ యో జోంగ్ తాజాగా స్పందించారు.

బార్డర్లో సైనిక విన్యాసాలు చేపట్టడం ఆత్మహత్యా సదృశ్యమేనని సౌత్ కొరియాను తీవ్రంగా హెచ్చరించారు. ఇది ముమ్మాటికీ తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని మండిపడ్డారు. తమను రెచ్చగొడితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. సౌత్ కొరియా డ్రిల్స్ కు జవాబు చెప్పే పనిలో తమ సైనిక బలగాలు నిమగ్నమయ్యాయని చెప్పారు. అయితే, ఏం జరుగుతోందనే వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈమేరకు కిమ్ యో జాంగ్ స్టేట్ మెంట్ ను నార్త్ కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ మీడియాకు విడుదల చేసింది.

కాగా, ఇటీవలి కాలంలో కొరియాల మధ్య బెలూన్ వార్ జరిగింది. భారీ బెలూన్లకు చెత్త మూటలు కట్టి తమ పొరుగు దేశంలోకి పంపించాయి. సౌత్ కొరియా ఈ బెలూన్లతో పాటూ బార్డర్ లో భారీ స్పీకర్లను పెట్టి పాప్ మ్యూజిక్ వినిపించింది. నార్త్ కొరియాకు వ్యతిరేకంగా ముద్రించిన పాంప్లెట్లను బెలూన్లకు కట్టి ఆ దేశంలో జారవిడిచింది. ఈ చర్యలతో మండిపడ్డ కిమ్.. ఇటీవల వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపట్టారు.
North Korea
Kim Jong Un
Kim Yo Jong
Kim Sister
South Korea
Military Drills

More Telugu News