K.Kavitha: డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత.. ఇంతకీ ఏమిటీ డిఫాల్ట్ బెయిల్?

BRS Mlc Kavitha Filed Default Bail petition In Rose Avenue Court
  • సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్
  • దర్యాఫ్తు పూర్తిచేయడంలో విఫలమైందని ఆరోపణ
  • విచారణకు స్వీకరించే అవకాశం ఉందంటున్న నిపుణులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇటీవల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం, తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేయకపోవడంతో కవిత తరఫున ఆమె లాయర్లు ఈ పిటిషన్ వేశారు. నిర్ణీత వ్యవధిలోగా సీబీఐ దర్యాఫ్తు పూర్తిచేయలేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ క్లయింట్ కు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

డిఫాల్ట్ బెయిల్ అంటే..
నిర్ణీత వ్యవధిలోగా పోలీసులు, దర్యాఫ్తు సంస్థలు కేసు విచారణ పూర్తిచేయడంలో విఫలమైతే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి బెయిల్ పొందే హక్కును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ) కల్పిస్తోంది. సీఆర్ పీసీ సెక్షన్ 167(2) ప్రకారం.. నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైతే బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుంది. అయితే, ఇది కేసు తీవ్రతను బట్టి దర్యాఫ్తు గడువు వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా నిందితులను అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో విచారణ పూర్తిచేయడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తే నిందితులని కోర్టులో ప్రవేశ పెట్టి కస్టడీకి కోరాల్సి ఉంటుంది. జడ్జి 15 రోజుల వరకు కస్టడీకి (పోలీస్ లేదా జ్యుడీషియల్) అప్పగిస్తారు.

ఆ గడువులోగా కూడా విచారణ పూర్తికాకుంటే కేసు తీవ్రతను బట్టి కస్టడీ గడువును జడ్జి పొడిగిస్తారు. మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో కస్టడీ గడువు గరిష్ఠంగా 90 రోజులు.. మిగతా కేసుల విషయంలో.. దర్యాఫ్తు అధికారి/ సంస్థ మరో అత్యవసర కేసును కూడా విచారిస్తుంటే గరిష్ఠంగా 60 రోజుల కస్టడీ విధించవచ్చు. ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ కంప్లీట్ కాని సందర్భంలో నిందితులు పొందే చట్టబద్ధమైన హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు. కవిత కేసుకు సంబంధించి ఈ గడువు పూర్తవడంతో ఆమె తరఫున లాయర్లు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
K.Kavitha
BRS MLC
Default Bail Petition
Delhi Liquor Scam
Rose Avenue court

More Telugu News