High Court: దానం, కడియంలపై అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
- బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు
- వారిపై అనర్హత వేటు వేయాలని కోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్
- వాదనలు విన్న హైకోర్టు... తదుపరి విచారణ గురువారానికి వాయిదా
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా ఆరడజను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం, కడియం, వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరింది. అనంతరం ఆయన చర్యలు తీసుకోవడం లేదంటూ కోర్టుకు వెళ్లారు.
స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదని హైకోర్టుకు తెలిపారు. వారి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.