Jagga Reddy: బీజేపీ పొలిటికల్ గేమ్... విభజన సమస్యల పేరుతో చంద్రబాబు ఎంటర్ అయ్యారు: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్య
- ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్‌ను తెలంగాణలో ఆడాలని బీజేపీ భావిస్తోందని వ్యాఖ్య
- చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
- టీడీపీ, జనసేన పేరుతో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తోందని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు రెండు రాష్ట్రాల అంశంలోకి ఎంటర్ అయ్యారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్‌ను తెలంగాణలో ఆడాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. అందుకు చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ఐటీకి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని... అయితే దానిని చంద్రబాబు కొనసాగించారన్నారు.
తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందని... టీడీపీని ముందుబెట్టి గేమ్ ఆడుతోందన్నారు. తెలంగాణను కూడా బీజేపీ కబ్జా చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో అడుగుపెట్టి... రెండు కళ్ల సిద్ధాంతం రాజకీయాన్ని మొదలు పెట్టారన్నారు. తమ పార్టీని తెలంగాణలో దెబ్బతీసేందుకే టీడీపీ, జనసేనలను బీజేపీ రంగంలోకి దించిందన్నారు. వివిధ కేసుల్లో ఉన్నవారు బీజేపీలో చేరారని విమర్శించారు.