Vijayashanti: సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
- తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కంటే టీడీపీ ప్రయోజనమే చంద్రబాబు రహస్య అజెండాగా ఉందేమోనన్న విజయశాంతి
- తెలంగాణలో టీడీపీ తిరిగి విస్తరిస్తుందనడంపై సందేహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకురాలు
- బీజేపీతో కలిసి బలపడడానికి ప్రయత్నిస్తే కాషాయ పార్టీ కూడా గల్లంతు అవుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు
విభజన సమస్యల పరిష్కారం కోసం ఇటీవల జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల ముఖాముఖి భేటీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారని, కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని ఆమె సందేహం వ్యక్తం చేశారు.
తెలంగాణాలో మళ్లీ టీడీపీ విస్తరిస్తుందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలంగాణాలో టీడీపీ బలపడుతుందని ఆయన అనడం పలు అనుమానాలకు తావిస్తోందని విజయశాంతి అన్నారు. తెలంగాణాలో టీడీపీ ఎప్పటికీ బలపడదని అన్నారు. తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి బలపడడానికి కుట్రలు చెయ్యడానికి ప్రయత్నిస్తే టీడీపీతో పాటు కాషాయ పార్టీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవమని విజయశాంతి వ్యాఖ్యానించారు.
అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుందని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు.. రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తామని అనాల్సిన అవసరం ఏముందని విజయశాంతి ప్రశ్నించారు. వారి కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందని, విమర్శలు చేయాల్సిన అవసరం లేదంటూ కూటమి నాయకులకు చెప్పడం బహుశా సమంజసంగా ఉంటుందంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.