Team India: ఇప్పుడంటే రూ.125 కోట్లు.. 2007, 2011, 2013లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్లకు బీసీసీఐ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

After India won the 2007 ICC World T20 the entire team was rewarded Rs 12 crores
  • 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు మొత్తం కలిపి రూ.12 కోట్లు మాత్రమే రివార్డు
  • 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టు ఆటగాళ్లకు కోటి రూపాయల చొప్పున నజరానా
  • 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు రూ.2 కోట్లు అందజేసిన బీసీసీఐ
టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడడంతో 11 ఏళ్ల తర్వాత టీమిండియా తిరిగి ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత తిరిగి మరోసారి ఐసీసీ టైటిల్‌ను దక్కించుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పటిష్ఠమైన దక్షిణాఫ్రికా జట్టును మట్టికరిపించి టీ20 వరల్డ్ కప్ 2024ను సొంతం చేసుకుంది. దీంతో 14 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకుంది. ఈ క్రమంలో రోహిత్ సేనకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు, సెలక్టర్లు మొత్తం 42 మందికి కలిపి ఏకంగా రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. 

దీంతో జట్టులోని ఆటగాళ్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌‌లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు చొప్పున, మిగతా సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లకు కూడా గణనీయ సంఖ్యలోనే నగదును పంపిణీ చేశారు. రిజర్వ్ ఆటగాళ్లకు రూ.2.5 కోట్లు, కోచింగ్ సిబ్బందికి రూ.1 కోటి చొప్పున, బ్యాక్‌రూమ్ సిబ్బంది, వైద్యులు, త్రోడౌన్ నిపుణులకు రూ.2 కోట్లు చొప్పున, సెలక్టర్లకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున అందజేసింది. మరి ఇప్పుడంటే పెద్ద మొత్తంలో నగదు బహుమతిని అందించారు. కానీ 2007లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2011లో వన్డే వరల్డ్ కప్‌లను గెలిచిన సమయంలో బీసీసీఐ తక్కువ మొత్తంలో ప్రైజ్‌మనీని ప్రకటించింది.

2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు బీసీసీఐ ఒక్కో ఆటగాడికి కోటి రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇక సహాయక సిబ్బంది ఒక్కొక్కరికి రూ.30 లక్షల చొప్పున అందించింది. ఇక 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు బీసీసీఐ ఒక్కో ఆటగాడికి రూ. 1 కోటి ప్రైజ్ మనీని ప్రకటించింది. అయితే ఆ తర్వాత దానిని మరో కోటి పెంచి మొత్తం రూ.2 కోట్లు ముట్టచెప్పింది. ఇక సహాయక సిబ్బందికి రూ.50 లక్షలు, సెలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున రివార్డులు అందజేసింది. ఇక 2007లో ఐసీసీ తొలి టీ20 వరల్డ్ కప్‌ని గెలిచిన భారత జట్టుకు మొత్తం కలిపి రూ.12 కోట్లు మాత్రమే రివార్డుగా బీసీసీఐ అందజేసింది.
Team India
T20 World Cup 2024
T20 World Cup 2007
Cricket
BCCI

More Telugu News