Wimbeldon 2024: మీరు నన్నేమీ చేయలేరు.. గేలి చేసిన వింబుల్డన్ ప్రేక్షకులపై జొకోవిచ్ ఆగ్రహం
- ప్రేక్షకుల్లో కొందరు తనను అగౌరవపరిచారని మండిపాటు
- వారికి ‘గూడ్.... నైట్’ అంటూ సాగతీసి పలుకుతూ ఎగతాళి చేసిన సెర్బియా దిగ్గజం
- అయితే ఈ విషయంలో వింబుల్డన్ నిర్వాహకుల తప్పేమీ లేదని వెల్లడి
సెర్బియా దిగ్గజం, ప్రపంచ రెండో ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ ప్రేక్షకులపై మండిపడ్డాడు. తన ప్రత్యర్థి హోల్గర్ రూనీపై అభిమానం ప్రదర్శించే క్రమంలో తనను ఉద్దేశపూర్వకంగానే ఎగతాళి చేశారని ఆక్షేపించాడు. సోమవారం సాయంత్రం ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరిగిన వింబుల్డన్ పురుషుల నాలుగో రౌండ్ పోరులో 15వ ర్యాంకర్ హోల్గర్ రూనీపై జొకోవిచ్ సునాయాసంగా నెగ్గాడు. 6–3, 6–4, 6–2 వరుస సెట్లలో రూనీని మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. తద్వారా వింబుల్డన్ టోర్నీలో 15వ సారి, గ్రాండ్ స్లామ్ చరిత్రలో 60వ సారి క్వార్టర్స్ లోకి ప్రవేశించిన ఆటగాడిగా జొకోవిచ్ రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ కొందరు ప్రేక్షకుల తీరును తప్పుబట్టాడు. ‘ఆటపై గౌరవంతో రాత్రి దాకా వేచి ఉన్న అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారిని మెచ్చుకుంటున్నా. అదే సమయంలో ఒక ఆటగాడిని అంటే ఈ విషయంలో నన్ను అగౌరవపరిచిన ప్రేక్షకులకు గూ...డ్ నైట్’ అంటూ సాగదీసి పలుకుతూ ఎగతాళి చేశాడు. ‘రూ...నీ’ అంటూ సాగదీసి పలుకుతూ ఉత్సాహపరిచిన రూనీ అభిమానులకు అదే రీతిలో బదులిచ్చాడు.
దీంతో టీవీ వ్యాఖ్యాత జోక్యం చేసుకొంటూ ప్రేక్షకులెవరూ ఎగతాళి చేయలేదని.. రూనీకి మద్దతుగా గట్టిగా అరిచారని వివరణ ఇవ్వగా జొకోవిచ్ అందుకు అంగీకరించలేదు. ‘వాళ్లు నన్ను ఎగతాళి చేశారు. మీ వివరణను నేను అంగీకరించను. వాళ్లు రూనీని ఉత్సాహపరుస్తున్నారని తెలుసు. కానీ నన్ను ఎగతాళి చేసేందుకు వారికి అదో వంక మాత్రమే. నేను 20 ఏళ్లకుపైగా ఈ టూర్ కు వస్తున్నా. ఇక్కడ ఎలాంటి టక్కుటమారాలు జరుగుతాయో నాకు తెలుసు. కానీ టెన్నిస్ ను ప్రేమించేందుకు, ఆటగాళ్లను ప్రశంసించేందుకు టికెట్ కొనుక్కొని ఇక్కడకు వచ్చే వారిపైనే నేను దృష్టి పెడతా. నేను ఇంతకన్నా అనిశ్చిత పరిస్థితుల మధ్య మ్యాచ్ లు ఆడాను. మీరు నన్నేమీ చేయలేరు’ అంటూ తనను ఎగతాళి చేసిన వారిపై జొకోవిచ్ విమర్శలు గుప్పించాడు.
అనంతరం ఇదే అంశంపై విలేకరులతో మాట్లాడుతూ ఏ ఆటగాడిని ప్రోత్సహించాలో ప్రేక్షకుల ఇష్టమని.. అది వారి హక్కు అని చెప్పాడు. తాను నిజమైన అభిమానులను గౌరవిస్తానని.. కానీ ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే మాత్రం తాను స్పందిస్తానని అన్నాడు. అయితే ఈ విషయంలో వింబుల్డన్ నిర్వాహకులు చేసేదేమీ లేదని.. తప్పుగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రేక్షకుల్లోని ఓ గుంపు మొత్తాన్ని బయటకు తరలించడం సాధ్యం కాదని జొకోవిచ్ అభిప్రాయపడ్డాడు.