Jasprit Bumrah: జ‌స్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు

Jasprit Bumrah named ICC Player of the Month for June 2024
  • జూన్ నెల‌కు గాను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్‌గా బుమ్రా
  • రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్‌ను అధిగ‌మించి అవార్డు గెలుచుకున్న వైనం
  • ఇది త‌న‌కు ప్రత్యేక గౌరవమ‌న్న జ‌స్ప్రీత్‌ బుమ్రా
ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ‌కప్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు తాజాగా మ‌రో అవార్డు ద‌క్కింది. జూన్ నెల‌కు గాను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును అత‌డు సొంతం చేసుకున్నాడు. 

ఇక ఈ అవార్డు కోసం టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన స్టార్ ప్లేయ‌ర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా పోటీ ప‌డ్డారు. కానీ, వారిద్ద‌రినీ అధిగ‌మించి బుమ్రా అవార్డు ద‌క్కించుకోవ‌డం విశేషం. కాగా, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ ఆసాంతం ఈ స్టార్ పేస‌ర్ అద్బుతంగా రాణించాడు. త‌ద్వారా టీమిండియా టైటిల్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 

బార్బడోస్‌లో జ‌రిగిన ఫైన‌ల్‌లో చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో రెండు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన బుమ్రా కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన ఒక వికెట్ కూడా తీశాడు. మొత్తంగా టోర్న‌మెంట్‌లో 4.17 ఎక‌నామీ, 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. దాంతో అత్యుత‌మ గ‌ణాంకాలు న‌మోదు చేసినందుకు గాను అత‌నికి ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ద‌క్కింది.

ఇది నాకు ప్రత్యేక గౌరవం: బుమ్రా
"జూన్ నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషం. అమెరికా, వెస్టిండీస్‌లో గడిపిన కొన్ని వారాలు ఎంతో చిరస్మరణీయం. ఆ తర్వాత నాకు ఇది ప్రత్యేక గౌరవం. జ‌ట్టుగా జ‌రుపుకోవ‌డానికి చాలా ఉంటాయి. కానీ, ఈ వ్యక్తిగత ప్రశంస ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే. టోర్నీలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం, జ‌ట్టు ట్రోఫీ గెల‌వ‌డం చాలా ఆనందంగా ఉంది. చివర్లో ట్రోఫీ ఎత్తడం చాలా ప్రత్యేకమైంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను.

ఇక జూన్ నెలలో ఈ అవార్డు కోసం పోటీ ప‌డ్డ రోహిత్‌, గుర్బాజ్‌కు నా అభినంద‌న‌లు. చివరిగా నా కుటుంబ సభ్యులకు, నా సహచరులు, కోచ్‌లతో పాటు అభిమానులు నాకు ఓటు వేసినందుకు ధన్యవాదాలు. వారి మద్దతు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను" అని జ‌స్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.
Jasprit Bumrah
ICC Player of the Month
June 2024
T20 World Cup 2024
Team India
Cricket
Sports News

More Telugu News