Krishnavamshi: సిరివెన్నెలగారు మొదట నన్ను ఆఫీస్ బాయ్ అనుకున్నారు: కృష్ణవంశీ
- సిరివెన్నెల గురించి ప్రస్తావించిన కృష్ణవంశీ
- ఆదిభిక్షువు పాట ఆలోచింపజేసిందని వెల్లడి
- 'శివ' సినిమా నుంచి సాన్నిహిత్యం పెరిగిందని వ్యాఖ్య
- ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టమని వివరణ
కృష్ణవంశీ .. క్రియేటివ్ డైరెక్టర్ గా ఆయనకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆయన తన సినిమాలలోని పాటలను ఎక్కువగా సీతారామశాస్త్రితో రాయించడానికి ఇష్టపడేవారు. తానూ ఆయనకీ వీరాభిమానినని తరచూ చెబుతుంటారు. తాజాగా ఈటీవీ విన్ లో 'నా ఉచ్ఛ్వాసం కవనం' కార్యక్రమంలో, సీతారామశాస్త్రితో తనకి గల అనుబంధాన్ని గురించి ఆయన ప్రస్తావించారు.
"సీతారామశాస్త్రిగారు రాసిన 'ఆది భిక్షువు' పాట వినగానే నేను ఆలోచనలో పడిపోయాను. ఇంత గొప్ప సాహిత్యాన్ని ఎవరా రాసింది అని తెలుసుకున్నాను. ఆ తరువాత కొంతకాలానికి నేను 'బ్రహ్మ నీరాత తారుమారు' అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ సమయంలోనే నేను మొదటిసారిగా సిరివెన్నెల గారిని చూశాను. ఆయన మా ఆఫీసులోనే పాట రాస్తూ, మంచినీళ్లు - టీ పట్టుకుని రమ్మన్నారు.
" ఆయన నన్ను ఆఫీస్ బాయ్ అనుకుంటున్నారనే విషయం నాకు అర్థమైంది. అయినా నేనేం హర్ట్ కాలేదు. వెళ్లి ఆయనకీ టీ తీసుకుని వచ్చాను. ఆ తరువాత 'శివ' సినిమా సమయంలో కలుసుకున్నాము. అక్కడి నుంచి వరుస సినిమాలకు కలిసి పనిచేశాము. అలా ఆయనతో సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. ఆయనతో అత్యంత చనువుగా ఉండేవారిలో నేను ఒకడిని కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పారు.