Damodara Raja Narasimha: జేఎన్టీయూలో చట్నీలో ఎలుక ఘటన... మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం

Damodara fires at officers for rat in food in JNTU

  • ఘటనకు సంబంధించి తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • తెలంగాణవ్యాప్తంగా క్యాంటీన్లలో తనిఖీ చేయాలని ఆదేశాలు
  • జేఎన్టీయూ వంటగదిని పరిశీలించిన అదనపు కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో చట్నీలో ఎలుక రావడంపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌లో ఈ కాలేజీ ఉంది. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంగారెడ్డి అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు, క్యాంటీన్లలో తనిఖీలు చేయాలన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన ఆహారం ఉండేలా... ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని ఆదేశించారు.

వంటగదిని పరిశీలించిన అదనపు కలెక్టర్

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి జేఎన్టీయూ క్యాంపస్‌లోని వంట గదిని పరిశీలించారు. వంటగది అపరిశుభ్రంగా కనిపించడంతో ప్రిన్సిపల్, సిబ్బంది, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు. విద్యార్థులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించాలని సూచించారు.

  • Loading...

More Telugu News