KTR: డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తే ఏమవుతుంది?: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం
- ఓయూ విద్యార్థుల్ని అడ్డాకూలీలంటూ రేవంత్ రెడ్డి అవమానించారని వ్యాఖ్య
- విద్యార్థుల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారినే మోసం చేస్తున్నారని విమర్శ
- మెగా డీఎస్సీ అని చెప్పి వారిని దగా చేస్తారా? అని నిలదీత
- ఓయూ విద్యార్థులన్నా... నిరసనకారులన్నా... సీఎంకు కోపం ఎందుకో? అని ఆగ్రహం
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని... తిన్నది అరిగేదాకా అరిచే బీరు బిర్యానీ బ్యాచ్ అని అవమానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని వారిని అవహేళన చేశారన్నారు. ఆ తర్వాత అదే విద్యార్థులను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని... ఈ విషయం మరిచిపోవద్దని వ్యాఖ్యానించారు. విద్యార్థుల డిమాండ్ మేరకు డీఎస్సీని వాయిదా వేస్తే తప్పేమిటన్నారు. డీఎస్సీ వాయిదా వేయాలంటూ, పోస్టులు పెంచాలని డిమాండే చేస్తూ ఓయీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై కేసులు పెట్టడం, నిర్బంధించడం, అరెస్ట్ చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం తీరును ఖండించారు.
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని చెప్పి ఇప్పుడు వారిని దగా చేస్తారా? అని నిలదీశారు. తొలి కేబినెట్లోనే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని మాట ఇచ్చారని... ఇప్పటికి తొమ్మిది నెలలు అవుతోందన్నారు. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన కాంగ్రెస్ ప్రభుత్వానికి వినపడటం లేదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వం ఏర్పడటంతో సరిపోయిందా? అన్నారు. ఓయూ విద్యార్థులన్నా... నిరసనకారులన్నా... సీఎంకు కోపం ఎందుకో చెప్పాలన్నారు. నాడు ఓయూ విద్యార్థులను అవమానించి... ఆ తర్వాత వారిని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రణరంగంగా మారుస్తున్నారని ఆరోపించారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారన్నారు. వందల మందిని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాపాలన? అంటే అని ప్రశ్నించారు. ఓయూ దేశ సరిహద్దుల్లో ఉందా? అక్కడికి అన్ని బలగాలను తెచ్చి ఎందుకంత నిర్బంధాన్ని విధిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. మళ్లీ ఓయూలో ఉద్యమం నాటి పరిస్థితులను ఈ సర్కార్ తీసుకు వస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా? అన్నారు. సీఎంగా అవకాశం వచ్చినా డీఎస్సీ విద్యార్థులను రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు.
ప్రిపరేషన్‌కు టైమ్ ఇవ్వకుండా భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. పరీక్షలు వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులే కోరుతుంటే వారి డిమాండ్‌ను పరిశీలించటంలో ప్రభుత్వం ఎందుకింత మొండివైఖరి వహిస్తుందో చెప్పాలన్నారు. న్యాయమైన డిమాండ్లను ఆడబిడ్డలు అడిగినంత మాత్రాన అర్థరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా? మహిళలు అంటే ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు... ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాన మోసే సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ప్రశ్నించడానికి ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు.