Rahul Dravid: రాహుల్ ద్రావిడ్‌కు జై షా వీడ్కోలు సందేశం.. ఆసక్తికర వ్యాఖ్యలు

I express my sincere thanks and gratitude to Rahul Dravid says Jay Shah
  • అత్యంత విజయవంతమైన ప్రధాన కోచ్‌గా పదవీకాలం ముగించారని ప్రశంస
  • నిరంతర కృషితో ఆటగాళ్ల ప్రతిభకు సాన పెట్టారంటూ మెచ్చుకోలు
  • హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపిన బీసీసీఐ సెక్రటరీ
భారత్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ 2024తో ముగిసిపోయింది. కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కోచ్ పదవి నుంచి దిగిపోయిన రాహుల్ ద్రావిడ్‌కు జై షా వీడ్కోలు సందేశాన్ని ఇచ్చారు.

భారత జట్టుకు అత్యంత విజయవంతమైన ప్రధాన కోచ్‌గా పదవీకాలం ముగించిన రాహుల్ ద్రావిడ్‌కు జై షా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ద్రావిడ్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను సాధించిందని, అన్ని ఫార్మాట్‌లలో ఆధిపత్య టీమ్‌గా భారత జట్టు అవతరించిందని అన్నారు. వ్యూహాత్మక నైపుణ్యం, నిరంతర కృషితో ఆటగాళ్ల ప్రతిభకు రాహుల్ ద్రావిడ్ సానపెట్టారని జైషా ప్రశంసించారు. జట్టులో ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని నెలకొల్పారని, జట్టులో తన వారసత్వాన్ని నింపారని కొనియాడారు. నేడు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఒకరి విజయాన్ని మరొకరు ఆనందిస్తున్నారని, సవాళ్లను ఎదుర్కొంటూ ఒక్కటిగా ముందుకు సాగడానికి బాటలు వేశారంటూ ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జై షా స్పందించారు.

కాగా భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ మూడేళ్ల పాటు పనిచేశారు. టీ20 ప్రపంచకప్, ఆసియాకప్‌లను గెలిపించారు. 2023 వన్డే ప్రపంచకప్ తృటిలో చేజారింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఫైనల్‌లో జట్టు ఓడిపోయింది. ఈ రెండు టైటిల్ పోరుల్లోనూ ప్రత్యర్థి ఆస్ట్రేలియానే కావడం గమనార్హం.
Rahul Dravid
Jay Shah
BCCI
Team India
Cricket

More Telugu News